Breaking News

వణుకుతున్న ప్రపంచం

వణుకుతున్న ప్రపంచం

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రపంచం మొత్తం కరోనా ధాటికి విలవిల్లాడుతోంది.. మహమ్మారి నానాటికీ విజృంభిస్తోంది. వాళ్లు.. వీళ్లు అనే తేడా లేకుండా జనం పిట్టల్లా రాలిపోతున్నారు. బాధితుల సంఖ్య రెట్టింపవుతోంది. అడ్డుకోవడం ఏ దేశం తరం కావడం లేదు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కోటికి పైగా నమోదయ్యాయన్న వార్త ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తి చాలా వేగంగా ఉండడంతో రెట్టింపు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అంతర్జాతీయం సమాజంలో రోజురోజుకూ వైరస్‌ వ్యాప్తి పెరుగుతూ ఉండటంతో ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ‘వరల్డ్‌ మీటర్‌’ కరోనా తాజా గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య కోటి దాటింది. ఇప్పటికే కరోనా చికిత్సలో పలు ఔషధాలు మెరుగైన ఫలితాలు చూపిస్తున్నప్పటికీ.. వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.

వామ్మో.. కోటి పైమాటే

ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో 4,97,083 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటివరకూ అక్కడ 25.54 లక్షల మందికి కరోనా వచ్చింది. 1.27 లక్షల మంది మరణించారు. బ్రెజిల్‌లో 12.80లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే, 56వేల మరణాల సంభవించాయి. రష్యాలో ఇప్పటివరకు 6.27 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదుతో పాటు 9వేల మరణాలు చోటుచేసుకున్నాయి. యూకేలోనూ కరోనా ప్రభావం క్రమంగా పెరుగుతోంది. అక్కడ 3.10లక్షల కేసులు నిర్ధారణ అయ్యాయి. 43 వేల మంది చనిపోయారు. ప్రారంభంలో స్పెయిన్‌ (2.95లక్షల కేసులు), ఇటలీ (2.40లక్షల కేసులు) దేశాల్లో కరోనా మరణ మృదంగం మోగించగా.. ప్రస్తుతం వైరస్‌ ప్రభావం తగ్గుతూ వస్తున్నది. అయితే, పెరూ (2,72,364), చిలీ (2,63,630), మెక్సికో(2,08,392), జర్మనీ (1,94,445) దేశాల్లో వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. అలాగే, పాకిస్థాన్‌లో 1,98,883 కేసులు, బంగ్లాదేశ్‌లో 1,33,978 కేసులు, చైనాలో 83,483 కేసులు నమోదయ్యాయి.
ఇండియాలో 5లక్షలకు పైగా బాధితులు
ఇండియాలోనూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,552 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 384 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,08,953కు చేరింది. మరణాల సంఖ్య 15,685కు పెరిగింది. ప్రస్తుతం 1,97,387 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 2.95 లక్షల మంది కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 58.25 శాతంగా ఉంది. కాగా, దేశంలో తొలి పాజిటివ్‌ కేసు వెలుగుచూసినప్పటి నుంచి లక్ష కేసులు నమోదుకావడానికి 110 రోజులు పట్టింది. ఆ తర్వాత లక్ష కేసులకు 15 రోజులు, మరో లక్ష కేసులకు 10 రోజులు తీసుకుంది. 3లక్షల నుంచి 4 లక్షలకు చేరడానికి 8 రోజులు పట్టింది. అయితే, గడిచిన ఆరు రోజుల్లోనే లక్షకు పైగా కేసులు నమోదుకావడం దేశంలో కరోనా ఉధృతికి అద్దం పడుతోంది. ఇండియాలో కరోనా వ్యాప్తి చాలా స్పీడ్​గా ఉంది. కరోనా వ్యాప్తిలో ఇండియా ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నట్టు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇండియాకు చాలా నష్టమని, మున్ముందు కేసుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.