ఆమె ఓ సాధారణ లేడీ కానిస్టేబుల్. కానీ ఏకంగా మంత్రి కొడుకుకే చుక్కలు చూపించింది. నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి సుపుత్రుడికి నడి రోడ్డుమీదే వార్నింగ్ ఇచ్చింది. ‘నేను నీకు నీ బాబుకు సర్వేంట్ను కాను’ అంటూ హెచ్చరించింది. ఇటీవల గుజరాత్లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మహిళా కానిస్టేబుల్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. ఇక ఆ కానిస్టేబుల్ తెగువను మెచ్చుకోని వారంటూ లేరు. అయితే యధావిధిగా పోలీస్‌శాఖ మాత్రం ఆమెమీద కక్ష గట్టింది. ఆమెకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చింది. కానీ ఆమె మాత్రం బెదరలేదు. కొంచెం కూడా భయపడలేదు. కానిస్టేబుల్ ఉద్యోగానికే రాజీనామా చేసింది. ఐపీఎస్ అధికారిగా డిపార్ట్మెంట్లో అడుగుపెడతానంటూ శపథం చేసింది. రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన ఆ లేడీ కానిస్టేబుల్ పేరు సునీతా యాదవ్..
గుజరాత్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జులై 8 రాత్రి ఆమె సూరత్‌లో విధుల్లో ఉండగా.. ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి వేళ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చారు. దీంతో సునీత వారు కారు ఆపారు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకులు ‘మేం ఎవరో తెలుసా’ అంటూ సునీతపైకి రాబోయారు. ఆగ్రహించిన సునీత యాదవ్ నడిరోడ్డు మీదే వారిని చెడుగుడు ఆడేసింది. కాగా, ఆ ఇద్దరు యువకుల్లో ఒకరు ఆరోగ్యశాఖమంత్రి కుమార్ కానానీ కుమారుడు ప్రకాశ్ కానానీ. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే రాజకీయ ఒత్తిళ్లతో సునీతను ట్రాన్స్ఫర్ చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయింది. సునీతా సెలబ్రిటీగా మారిపోయారు. ఆమె కోసం అప్పుడే ఫ్యాన్స్క్లబ్లు, ఫేస్బుక్ పేజీలు పుట్టుకొచ్చాయంటే అభిమానం ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు.