సారథి న్యూస్, తాడ్వాయి: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడినట్లు చరిత్రలో లేదని వివరించారు. ప్రధాని మోడీ కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారని వివరించారు. రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తాడ్వాయి మండల కేంద్రంలో రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జలపు అనంతరెడ్డి అధ్యక్షతన సంతకాల సేకరణ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల నడ్డి విరిచేలా ఉన్నాయని, చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారే అవకాశం ఉందన్నారు. మిల్లర్లు రైతుల శ్రమను దోచుకుంటున్నారని విమర్శించారు. ఆదివాసీ విద్యార్థులను నక్సలైట్ల పేరుతో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని, ఆదివాసీ హక్కుల కోసం పోరాటాలు చేస్తే అణచివేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవి చందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరసవడ్ల వెంకన్న, ములుగు మండలాధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, ఎండీ ఆప్సర్ పాషా, మాజీ జడ్పీటీసీ బొల్లు దేవేందర్, స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్, రేగ కల్యాణి, సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు పాల్గొన్నారు.