Breaking News

రైతుబంధు, రైతుసమితి భేష్​

రైతుబంధు, రైతుసమితి భేష్​

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకం, రైతు సమన్వయ సమితి ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అభినందించింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న అగ్రికల్చర్ ఇన్ర్ఫాస్ట్రక్షర్ ఫండ్ స్కీంపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కోరారు. దేశ వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రజంటేషన్ లో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబంధు సమితి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున ఫార్మర్ నెట్ వర్క్ విస్తరించిందని వివరించారు.
వ్యవసాయ రంగం అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు
సీఎం కేసీఆర్ తరఫున వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం తరఫున పలు సూచనలు చేశారు. ‘అగ్రికల్చర్ ఇన్ఫ్రా స్ట్రక్షర్ ఫండ్ స్కీంను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుందన్నారు. వ్యవసాయరంగం అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు రావడానికి ఈ కొత్త పథకం దోహదపడుతుందన్నారు. రైతుబంధు పథకం ద్వారా 58 లక్షల మంది రైతులకు రూ.ఏడువేల కోట్లను ప్రతి పంటకు పెట్టుబడి సాయంగా అందిస్తున్నామని వివరించారు. గ్రామస్థాయి రాష్ట్రస్థాయి వరకు రైతుబంధు సమితులను ఏర్పాటు చేశామని, ఇందులో 1.65లక్షల మంది కమిటీ బాధ్యులుగా ఉన్నారని చెప్పారు.

ప్రతి ఐదువేల ఎకరాలను ఒక క్లస్టర్ గా ఏర్పాటుచేసి, ప్రతి క్లస్టర్ కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమింమన్నారు. పెద్దఎత్తున వ్యవసాయం సాగుతున్నందున తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఎరువులు, ముఖ్యంగా యూరియాను త్వరగా రాష్ట్రానికి పంపించాలని కోరారు. వ్యవసాయ మార్కెట్ల నిర్వహణలో సంస్కరణలు తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీడియో కాన్ఫరెన్స్ లో రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు.