- తలమాసినోడితో ఏదీ కాదు
- ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలును విస్తరిస్తాం
- వరద సాయం ఇచ్చేకాడ కిరికిరి ఏంది?
- యుద్ధ ప్రాతిపదికన మూసీ ప్రక్షాళన
- జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారసభలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రతి బడ్జెట్‌లో హైదరాబాద్‌కు రూ.10వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. వరదల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చేతులు ఊపినంత మాత్రాన సమస్య పోదన్నారు. ప్రధానమంత్రిని వరదసాయం కింద రూ.1300 కోట్లు అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. బెంగళూరు, అహ్మదాబాద్‌కు ఇచ్చి హైదరాబాద్‌కు ఇవ్వరా? తాము భారతదేశంలో లేమా?.. ఇది వివక్ష కాదా..? అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వరదల నుంచి హైదరాబాద్‌కు శాశ్వత విముక్తి కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న పరిశ్రమలను తరలిస్తామని, కాలుష్యాన్ని తొలగిస్తామన్నారు. మెట్రో రైలును పొడిగిస్తామని, ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలును విస్తరిస్తామన్నారు. హైదరాబాద్ అశాస్త్రీయంగా పెరిగింది, ఇప్పుడు చర్చ అనవసరం. హైదరాబాద్‌లో జరగాల్సిన పనులు చాలా ఉన్నాయని అన్నారు.
హైదరాబాద్‌ను అన్ని విధాలుగా బాగుచేస్తాం
హైదరాబాద్‌ను అన్ని విధాలుగా బాగుచేస్తామని, ఇండియాలో వరదలు రాని నగరం ఏదీ లేదన్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతాలోనూ వరదలొచ్చాయని గుర్తుచేశారు. తమ మంత్రులంతా మోకాళ్ల లోతు నీళ్లలో తిరిగారని, హైదరాబాద్‌లో వరదలు చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయని అన్నారు. పేదలకు సాయం చేయాలని ఇంటికి రూ.10వేలు ఇచ్చామని, చరిత్రలో వరద సాయం ఎవరూ ఇవ్వలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రాల్లో కూడా ఇవ్వలేదన్నారు. ఇచ్చేకాడ కిరికిరి పెడతారా? అని ప్రశ్నించారు. డిసెంబర్ 7 నుంచి మళ్లీ వరదసాయం పంపిణీ చేస్తామన్నారు. ఆరున్నర లక్షల మందికి రూ.650 కోట్లు ఇచ్చామని, ఇంకో రూ.400 కోట్లయినా ఇస్తామన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి వరదసాయం చేస్తామన్నారు.
తలమాసినోడు మాట్లాడితే ఏదీ జరగదు
హైదరాబాద్‌లో ఆరేళ్లుగా శాంతిభద్రతలు బాగున్నాయని, హైదరాబాద్‌లో ఉన్న సీసీ కెమెరాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. కొందరి కోసం పనిచేసి అందరి హైదరాబాద్‌ను ఆగం చేయబోమన్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చాం. తలమాసినోడు ఏదో మాట్లాడితే ఏమీ జరగదని తేల్చిచెప్పారు. యుద్ధ ప్రాతిపదికన మూసీ ప్రక్షాళన చేస్తామని, అందమైన నదిని ప్రజలకు అందిస్తామని సీఎం కేసీఆర్స్పష్టం చేశారు.