Breaking News

రమేశ్​ ఆస్పత్రి చుట్టూ రాజకీయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం రమేశ్​ ఆస్పత్రి, స్వర్ణప్యాలెస్​ అగ్నిప్రమాదంపై అధికార ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. రమేశ్​ ఆస్పత్రి కరోనా పేషెంట్లను స్వర్ణప్యాలెస్ హోటల్​లో ఉంచి చికిత్స అందించింది. ఈ క్రమంలో అగ్నిప్రమాదం జరిగి అందులో ఉన్న 10 మంది చనిపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, రమేశ్​ ఆస్పత్రి యజమాని రమేశ్​బాబు పరారీలో ఉన్నాడు. రమేశ్​ బాబు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ప్రభుత్వం కక్ష గట్టిందని.. ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. అందుకు వైఎస్సార్​సీపీ కూడా గట్టిగానే కౌంటర్​ ఇచ్చింది. రమేశ్​బాబు ఏ తప్పు చేయనప్పడు పరారీలో ఎందుకు ఉన్నాడని ప్రశ్నిస్తోంది. టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా రమేశ్​ ఆస్పత్రి యాజమాన్యాన్ని కాపాడేందుకు యత్నిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఎవరెన్ని ఒత్తిళ్లు చేసినా రమేశ్​ ఆస్పత్రిపై చర్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.

కాగా, విశాఖలో అగ్నిప్రమాదం జరిగినప్పడు బాధ్యులపై చర్యలు తీసుకోవాలిన డిమాండ్​ చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. స్వర్ణప్యాలెస్​ ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారని వైఎస్సార్​సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. స్వర్ణప్యాలెస్​ యజమాని తమవాడు కాబట్టే.. ఈ ఘటనపై టీడీపీ నేతలు నోరు మెదపడం లేదని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు రమేశ్​బాబు సమీప బంధువు సినీహీరో రామ్​ వైఎస్సార్​సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేశాడు. ఈ ట్వీట్లు సంచలనంగా మారాయి. హీరోరామ్​పై వైఎస్సార్సీపీ అభిమానులు, సోషల్​మీడియా విభాగం తీవ్రంగా విరుచుకుపడుతోంది. స్వర్ణప్యాలెస్​లో 10 మంది చనిపోతే స్పందించని రామ్​ తన బంధువును కాపాడేందుకు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం స్వర్ణప్యాలెస్​ ఘటనపై విచారణ చేపడుతుందని.. బాధ్యులు ఎంతటి వారైనా వదిలే ప్రస్తక్తే లేదని ఏపీ ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు. ఈ ఘటన ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.