సారథి న్యూస్, కర్నూలు: దేశంలో దళిత మహిళలపై దాడులు, అత్యాచారాలు అధికమయ్యాయని, ఘటన జరిగిన వెంటనే దోషులను పట్టుకుని ఉరితీస్తే తప్పా మార్పు రాదని లీడర్స్ యూత్ సొసైటీ, దళిత ప్రజాసంఘాల నాయకులు అన్నారు. యూపీలో పదిరోజుల క్రితం ఓ దళిత యువతిని నాలుక కోసి, మెడ, నడుము విరిచి అతిదారుణంగా అత్యాచారానికి పాల్పడిన దుండగులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ గురువారం కర్నూలు నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ ముందుగా డాక్టర్‌బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు. తమ ప్రభుత్వం ఏపీలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, తెలంగాణలో ఓ యువతిపై అత్యాచారం జరిగిన వెంటనే దిశా చట్టాన్ని తీసుకొచ్చిన ప్రథమ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని ఆయన కొనియాడారు. ఇలాంటి ఘటనలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే సహించేదిలేదని హెచ్చరించారు.
లీడర్స్ యూత్ సొసైటీ అధ్యక్షుడు కేదార్ నాథ్ మాట్లాడుతూ.. యూపీలో దళిత యువతిని అత్యాచారం చేసిన దోషులను తప్పించేందుకు పోలీసులే ఆమె శవాన్ని తల్లిదండ్రులకు ఇవ్వకుండా కాల్చివేశారని, ఇది అత్యంత దారుణమన్నారు. రాజకీయ వ్యవస్థ, చట్టాల్లో మార్పురావాలన్నారు. అనంతరం పర్ల సూరీడు మాట్లాడుతూ దళిత యువతి శవాన్ని తల్లిదండ్రులకు ఇవ్వకుండా దహన సంస్కారాలు చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ కు సంబంధించిన దళిత ప్రజా సంఘాల నాయకులు రాజేష్, సంపత్ కుమారి, బెగల్ హుస్సేన్, ఏసన్న, గిరిజన సంఘం రాజు, సత్రా రాజేష్ పాల్గొన్నారు.