వాషింగ్టన్: భారతసంతతికి చెందిన ఓ మహిళ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఏకంగా అమెరికా ఉపాధ్యక్ష పదవికే ఆమె పోటీపడనున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా సెనెటర్‌గా ఉన్న కమలా హారీస్‌ను డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీచేసేందుకు ఎంపిక చేశారు. ఈ మేరకు మంగళవారం డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యక్ష పదవి కోసం నెలరోజుల పాటు కసరత్తు చేసి.. చివరకు సరైన అభ్యర్థిని ఎంపిక చేశామని ఆయన చెప్పారు. కమలా హారిస్ తన వాగ్ధాటితో అమెరికన్లను మెప్పించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్‌కు ధీటుగా కమలా ప్రసగించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. కమలా హారిస్‌కు.. అమెరికాలోని ఉత్తమనేతల్లో ఒకరిగా పేరుంది. సోషల్‌మీడియాలోనూ ఆమె ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. సోషల్‌మీడియాలో తరుచూ పోస్టులు పెడుతూ అమెరికన్లను విశేషంగా ఆకట్టుకుంటున్న ట్రంప్ నకు.. కమలా చెక్ పెట్టగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. కమలా హారిస్ ప్రస్తుత ఎన్నికల్లో గెలిస్తే.. 2024 లేదా 2028లో డెమొక్రాట్ల తరపున అధ్యక్ష అభ్యర్థి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాగా తమ పార్టీకి కమలా అసలు పోటీనే ఇవ్వలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.