సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్ డౌన్ సమయంలో కేవలం వేళ్లపై లెక్కపెట్టే కేసులు మాత్రమే ఉండగా, లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు దండిగా నమోదవుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 40 మందికి కరోనా ప్రబలడంతో గమనార్హం. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 45కు చేరింది. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణం, తూప్రాన్, రామాయంపేట పట్టణాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జిల్లాకు చెందిన ఆరుగురు కరోనా బారినపడి మృత్యుఒడికి చేరడం ఆందోళన కలిగిస్తోంది.
తూప్రాన్, మెదక్, టెక్నాల్, శివ్వంపేట మండలం దొంతి, కొల్చారం మండలం రాంపూర్, నార్సింగికి చెందినవారు కరోనా సోకి చనిపోయారు. పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో మరణాలు సంభవిస్తుండడం జిల్లావాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా, జిల్లా ఎస్పీ ఆఫీసులో విధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుల్ కు ఆదివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో పోలీస్ వర్గాల్లో ఆందోళన మొదలైంది.