Breaking News

మెతుకుసీమ జలసంద్రం

భారీ వర్షం.. మెతుకుసీమ జలసంద్రం

సారథి న్యూస్, మెదక్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లాలో ప్రాజెక్టులు, చెరువు లు, కుంటలు, చెక్ డ్యాంలు పూర్తిగా నిండి పొంగిపొర్లుతున్నాయి. ఎగువన సంగారెడ్డి జిల్లా లోని సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండటం తో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో మంజీరా నది భారీ వరద ప్రవాహాన్ని సంతరించుకుంది. కొల్చారం మండలం చిన్నఘనపూర్ వద్ద నిర్మించిన వనదుర్గా ప్రాజెక్ట్ పొంగిపొర్లుతోంది. దీంతో మంజీరా నదీ పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హల్దీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మెదక్ పట్టణ శివారులోని పసుపు లేరు వాగు జోరుగా ప్రవహిస్తోంది. భారీవర్షాలకు కోతకు వచ్చిన వరి పంటలు నీట మునిగాయి. కొల్చారం మండలం రాంపూర్, కిష్టాపూర్ వద్ద వందలాది ఎకరాల్లో వారి పైరు నేలకొరిగింది. పలుచోట్ల కోసి పెట్టిన వరి పనలు కొట్టుకుపోయాయి. చేతికందే సమయంలో పంటలు దెబ్బ తినడంతో రైతులు లబోదిబో మంటున్నారు.

ఏడుపాయల వనదుర్గమాత ఉత్సవ విగ్రహం

ఏడుపాయల జనసంద్రం
సింగూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ మాత ఆలయాన్ని మూసివేశారు. గోపురం వద్ద ఉత్సవ విగ్రహం ఏర్పాటుచేశారు. భక్తులు ఇక్కడే పూజలు చేస్తున్నారు. ఆలయం సమీపంలోని ఒక వంతెన పూర్తిగా మునిగిపోయింది. ఆలయం వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.