- మృతుల్లో ఇద్దరు మహిళలు
- ఒకరు రెండేళ్ల చిన్నారి..
సారథి న్యూస్, మెదక్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒకరు రెండేళ్ల చిన్నారి ఉంది. బాలానగర్- మెదక్ నేషనల్ హైవే పై మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ వద్ద గురువారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన ఆటో మెదక్ నుంచి కొల్చారం వైపునకు వస్తుండగా హైదరాబాద్ నుంచి ఎదురుగా వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న కిష్టాపూర్ గ్రామానికి చెందిన శ్రీవర్శిని(2), వరిగుంతం గ్రామానికి చెందిన నిర్మల(46), అప్పాజిపల్లికి చెందిన సుమలత(25) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. కిష్టాపూర్ కు చెందిన చాకలి ఇందిర ఆమె కొడుకు, చాకలి వర్షిత్, వరిగుంతంకు చెందిన ముత్యాల స్వామి, కారులో ఉన్న సుకేష్, మహేందర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్ గా ఉండడంతో వీరిలో వర్షిత్, సుకేష్, మహేందర్ ను హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.