- కేరళ లో అరెస్టు చేసిన పోలీసులు
తిరువనంతపురం : సాంకేతికత పెరిగినకొద్దీ మోసాలు, అవి చేసే వాళ్ల ప్రవృత్తి కూడా పెరుగుతున్నది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి, ఆ వైరస్ నుంచి మనిషిని కాపాడడానికి తయారు చేసుకున్న మాస్కులో బంగారాన్ని స్మగ్లింగ్ చేశాడో వ్యక్తి. గురువారం కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..
కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేరళ నుంచి దుబాయ్ వెళ్లడానికి విమానం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో అందులో వెళ్లే ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా పోలీసులకు దిమ్మతిరిగే దృశ్యం కనిపించింది. ఒక ప్రయాణికుడు తాను పెట్టుకున్న ఎన్-95 మాస్క్ లో.. రూ.రెండు లక్షల విలువ చేసే బంగారాన్ని దాచి పెట్టాడు. ఇది చూసిన పోలీసులు కంగుతిన్నారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి అని ఎయిర్పోర్టులో మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి చేశారు. దీనిని ఆసరాగా చేసుకున్న ఆ దొంగ ఏకంగా మాస్క్ లోనే 40 గ్రాముల బంగారం ఉంచాడు. ఇది గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడిది కర్ణాటకలోని బత్కల అనే గ్రామం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.