Breaking News

మావోయిస్ట్​ అగ్రనేత గణపతి.. లొంగుబాటు

సారథి న్యూస్​, హైదరాబాద్​: మావోయిస్ట్​ కీలకనేత గణపతి అలియాస్​ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోనున్నట్టు సమాచారం. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలతో ఆయన చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 74 ఏళ్ల గణపతి కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడతున్నారు. నడవడానికి వ్యక్తిగత పనులు చేసుకునేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉండడం అసాధ్యమని భావించి ఆయన లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. ఆస్తమా, మోకాళ్లనొప్పి, డయాబెటిస్​తో గణపతి బాధపడుతున్నారు. ఆయనను అనుక్షణం ఇద్దరు సహాయకులుగా ఉంటున్నారట.

జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్‌లో ముప్పాల గోపాల్‌రావు, శేషమ్మ దంపతులకు 1950లో రెండో సంతానంగా గణపతి జన్మించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన గణపతి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై దళంలోకి వెళ్లారు. ఆయనకు భార్య విజయ, కుమారుడు వాసుదేవరావు ఉన్నారు. మొదట అయనకు ఆర్​ఎస్​యూ (రాడికల్​ స్టూడెంట్​ యూనియన్​) తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. జగిత్యాల జైత్రయాత్ర ఉద్యమంలో గణపతి కీలకపాత్ర పోషించారు. ఆయనపై పలు హత్యకేసులు ఉన్నాయి. కొండపల్లి సీతారామయ్యతో కలిసి ఆయన అనేక ఉద్యమాలను నడిపారు. మొదట పిపుల్స్​వార్​ పార్టీలో కీలకనేతగా ఎదిగిన గణపతి .. ఆ తర్వాత ఏర్పడిన మావోయిస్ట్​ పార్టీని అన్నీ తానై నడిపించారు. ఆ పార్టీకి చాలాకాలం పాటు కేంద్రకమిటీ కార్యదర్శిగా పనిచేశారు. గణపతి తలపై మహారాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి రివార్డు ప్రకటించింది.