Breaking News

మామా.. ఏక్​ పెగ్​ లా! తెలంగాణలో బార్లు ఓపెన్​

సారథిమీడియా, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మందుబాబులు ఖుషీ అయ్యే న్యూస్​ చెప్పింది. రాష్ట్రంలో బార్​లు, క్లబ్​లు తెరుచేందుకు అనుమతి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా లాక్​డౌన్​ తర్వాత బార్​, క్లబ్బులు, పబ్​లు బంద్​ అయ్యాయి. దీంతో వాటి నిర్వాహకులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు ఆరునెలల తర్వాత ప్రభుత్వం బార్లకు అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలకు లోబడి వీటిని అనుమతించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రానున్నాయి. అయితే ప్రభుత్వం బార్లకు కొన్ని నిబంధనలు విధించింది. అవేంటంటే.. బార్ల, క్లబ్బుల ప్రవేశ ద్వారం వద్ద థర్మల్​ స్క్రీనింగ్​ ఏర్పాటు చేయాలి. ఎవరికైనా అనారోగ్యం ఉంటే బయటకు పంపించాలి. బార్​లలో పనిచేసే సిబ్బంది కచ్చితంగా మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించాలి. ప్రతి గంటకోసారి బార్​ను శానిటైజ్​ చేయాలన్న నిబంధనలు విధించారు. ప్రతి టేబుల్​ వద్ద హ్యాండ్​శానిటైజర్​ను అందుబాటులో ఉంచాలని సూచించింది. మ్యూజిక్​ సిస్టం ఆన్​చేయడం.. జనం గుమికూడటం వంటి వాటికి అనుమతి ఇవ్వలేదు.