Breaking News

గుడ్లనర్వలో గంజాయి కలకలం

పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు
సామాజికసారథి, నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామంలో గంజాయి కలకలం రేగింది. ఇద్దరు యువకులు సిగరెట్లలో గంజాయి నింపుకొని సేవిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు శనివారం నాగర్ కర్నూల్ సీఐ కనకయ్య గౌడ్ తెలిపారు. కాగా నాగర్ కర్నూల్ జిల్లాలో చాపకింద నీరులా గంజాయి వాడకం విస్తరిస్తోంది. మొదట నాగర్ జిల్లా కేంద్రంలో మొదలైన గంజాయి వాడకం క్రమక్రమంగా పచ్చని పల్లెల్లోకి చొచ్చుకుపోయింది. ప్రధానంగా బిజినపల్లి మండల కేంద్రంతో పాటు పాలెం, కారుకొండ, గుడ్లనర్వ, ఖానాపూర్ తదితర గ్రామాల్లో గంజాయి వాడకం పెరిగిపోయింది. మైనర్ బాలురతో యువకులు గంజాయి సిగరెట్లలో పెట్టుకొని తాగుతున్నట్లు తెలుస్తోంది. పట్టణ శివారులు, నిర్మాణంలో ఉన్న భవనాలు , ఊరి బయట ఖాళీ ప్రదేశాలు, పాడుబడిన గదులను గంజాయి సేవించేందుకు యువకులు ఎన్నుకుంటున్నారు. గంజాయి మత్తులో ఏదైనా చిన్న గొడవ జరిగినా అధికంగా రియాక్షన్ కావడం, మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా దాడులకు దిగడం చేస్తున్నారు. పోలీసులు బిజినపల్లి మండలం పై ప్రత్యేక దృష్టి పెట్టి గంజాయి బారిన పడుతున్న యువతను సరైన దారిలో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోకి గంజాయి సరఫరా ఎలా చేస్తున్నారో ఎవరి ద్వారా పట్టణాలు, పల్లెల్లోకి పంపిణి చేస్తున్నారన్న దానిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు. గంజాయి వాడకాన్ని సమూలంగా నిర్మూలించాలంటే మొదట జిల్లాలోకి గంజాయి రవాణాను అడ్డుకొంటేనే ఇది సాధ్యమని సామాన్య ప్రజలు చెబుతున్నారు. పోలీసులు గంజాయి కేసులను మొక్కుబడిగా కాకుండా సీరియస్ గా తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.