- పోలీసుల కనుసన్నల్లో పత్తాలాట?
- ముడుపులిచ్చి మరీ పేకాట ఆడుతున్నట్లు ప్రచారం
- రింగ్ మాస్టర్లుగా ఇద్దరు బడా నేతలు
- ఆటకు రూ.వెయ్యి చొప్పున వసూలు..
- బిజినేపల్లి మండలం కేంద్రంగా భారీ గేమ్
- సుదూర ప్రాంతాల నుంచి జూదరుల రాక
సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పేకాట మూడుపూలు, ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. పోలీసు అధికారులకు ముడుపులు ఇచ్చి జూదరులు మరీ పత్తాలాట ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల శనివారం వట్టెం వద్ద పట్టుబడిన జూదరులను నాగర్ కర్నూల్ డీస్పీ, సీఐ నిగా పెట్టి పట్టుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పేకాట ముఠాలు రాజ్యమేలుతున్నాయి. ఆట ఆడటానికి కొంత చొప్పున వేసుకుని ఓ పోలీసుకు మరీ కప్పం కడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాలకే పరిమితమైన పేకాట.. అదే పత్తాలాట ఇప్పుడు మారుమూల గ్రామాలకు విస్తరించింది. ధనవంతులు, రియల్ ఎస్టేట్, చీకటి వ్యాపారాల బాగా సంపాదించిన వారు ఈ ఆటలో ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా బిజినేపల్లి కేంద్రంగా పేకాట జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి మొన్నటి దాకా నాలుగైదు గ్రామాలకే పరిమితమైన పత్తాలాట ఐదారు గ్రామాలకు వ్యాపించినట్లు స్పష్టమవుతోంది.
రింగ్ మాస్టర్లు ఎవరు?
కొన్ని సందర్భాల్లో టైం పాస్ కు ఆడే పేకాట రూ.లక్షల బిజినెస్ గా మారింది. ఒక్కో ఆటకు లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఒక్కో ఆటకు రూ.1.5 లక్షల నుంచి రూ.2లక్షల వరకు గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కోరోజు 10 నుంచి 12 ఆటలు ఆడుతున్నారు. డబ్బులు పోయినవాళ్లు దివాళా తీయగా, డబ్బులు వచ్చిన వాళ్లు ఖుషీతో వెనుదిరుగుతున్నారు. ఈ వ్యవహారాన్ని మండల కేంద్రానికి ఇద్దరు అట గాళ్లు పేకాట నిర్వహిస్తున్నట్లు స్థానికంగా కోడై చూస్తోంది. వారిద్దరూ ఆట నిర్వహణకు నిర్వాహకుల నుంచి ఆటకు రూ.వెయ్యి చొప్పున తీసుకుంటున్నారు. జూదరులు మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వస్తున్నారు. పేకాట ముఠాను నడిపిస్తున్న ఆ ఇద్దరు నెల కు పోలీసులకు రూ.20 వేల చొప్పున మాముళ్లు ముట్టజెప్తున్నట్లు స్థానికంగా కోడై చూస్తోంది. ఈ వ్యవహారాన్ని ఓ పోలీసు సిబ్బంది దగ్గరుండి చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ నుంచి వసూలు చేసిన సొమ్మును పై అధికారులకు ముట్టజెప్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా పేకాట రాయళ్లు పట్టుబడిన నేపథ్యలంలో ఆ ఇద్దరు రింగ్ మాస్టర్లపైనే చర్చ జరుగుతోంది. ఎవరా ఇద్దరు అంటూ గుసగుసలాడుతున్నారు. ఏదేమైనా చట్టవిరుద్ధమైన పేకాటపై ఉక్కుపాదం మోపాలని, ఈ తతంగం నడిపిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.