Breaking News

మల్దకల్ తిమ్మప్ప.. నీవే దిక్కప్ప!

మల్దకల్ తిమ్మప్ప.. నీవే దిక్కప్ప!

సారథి న్యూస్, మల్దకల్(జోగుళాంబ గద్వాల): ఆ ఊరు వాసులు తిరుపతి వెళ్లరు.. గ్రామస్తులు భవనం రెండవ అంతస్తు కూడా నిర్మించరు.. కాదని ఎవరైన నిర్మాణానికి పూనుకుంటే అనర్థాలు జరిగిపోతాయని అందరిలోనూ అనమానం. స్థానికంగా వెలసిన తిమ్మప్పస్వామిని తమ ఇష్టదైవంగా కొలుస్తారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదిశిలాక్షేత్రమైన మల్దకల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కొలిచేవారి కొంగుబంగారంగా వెలుగొందుతున్నాడు. భక్తులను అలరిస్తూనే వారి కోరికలు నెరవేర్చుతున్నాడు.
28 నుంచి ఉత్సవాలు
ఏటా మార్గశిర మాసంలో జరిగే ఉత్సవాలకు పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈసారి ఉత్సవాలు కోవిడ్ నిబంధనల అనుసరించి వేడుకలు జరగనున్నాయి. ఈనెల 28న(సోమవారం) కల్యాణోత్సవం, 29న(మంగళవారం) తెప్పోత్సవం, 30న(బుధవారం) రథోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక వంశీయులు ప్రహ్లాదరావు, కార్యనిర్వహణాధికారి సత్య చంద్రారెడ్డి తెలిపారు.
ఇది తిమ్మప్ప స్వామి విశిష్ఠత
కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిగా ఉండేది. గద్వాలను పాలించిన రాజు సోమనాద్రి ఈ ప్రాంతానికి రాగా, గుర్రం ముందుకు కదల్లేకపోయింది. దీంతో ఏదో మహిమ ఉందని గమనించిన సదరు రాజు అడవిలో ఒక బాలుడి సహాయంతో చూడగా అక్కడ ఒక శిల ఉండి.. దానిపై శ్రీనివాసుడు స్వయంభూగా వెలిసినట్లు గుర్తించాడు. అక్కడ గుడి నిర్మిస్తానని మొక్కుకున్నాడు. ఆ వెంటనే గుర్రం ముందుకు కదిలింది. దీంతో రాజు సోమనాద్రి అక్కడ పెద్ద ఆలయం నిర్మించి యేటా ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాడు. తనకు సహాయం చేసిన వాల్మీకి కులస్తులను పూజారులుగా నియమించాడు. ఇప్పటికీ అక్కడ ఆ వంశస్తులే పూజారులుగా పనిచేస్తున్నారు. ఇక్కడి వారు తిరుపతికి వెళ్లరు, ఇక్కడ రెండవ అంతస్తు నిర్మించరు. ఈ ఆచారం నేటికీ కొనసాగుతూ వస్తోంది. ఆలయాన్ని దినదినాభివృద్ధి చేస్తూ దేవాదాయ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆలయం రహదారిని భక్తిమార్గంగా ఏర్పాటుచేసి 12 మంది మహనీయుల విగ్రహాలను నెలకొల్పుతున్నారు. దీంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. అంతేకాకుండా సమీపంలోని దేవరగట్టుపై 60 అడుగుల ధ్యానముద్రలో ఉన్న ఈశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.