రీసెంట్గా ‘పవర్ స్టార్’ సినిమాను ఆర్జీవి వరల్డ్‌లో విడుదల చేసిన ఆర్జీవి ఇప్పుడు ‘మర్డర్’ కుటుంబకథా చిత్రమ్ ట్రైలర్‌ను విడుదల చేశాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే వర్మ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య నేపథ్యంలో ‘మర్డర్’ సినిమాను ‘కుటుంబ కథా చిత్రమ్’ అనే ట్యాగ్ లైన్‌తో తీస్తున్న విషయం తెలిసిందే. అగ్రకులానికి చెందిన ఓ యువతి కులాంతర వివాహం చేసుకున్న తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను వర్మ ఈ చిత్రంలో స్పష్టంగా చూపిస్తున్నట్టు ఈ ట్రైలర్‌తో అర్థమవుతోంది. కూతురుపై విపరీతమైన ప్రేమ పెంచుకున్న ఓ తండ్రి.. తన కూతురు ఓ యువకుడితో ప్రేమలో పడి అతడినే పెళ్లిచేసుకుని, తండ్రికి ప్రతిగా తయారవుతుంది.
తన కూతురు తీరు తట్టుకోలేక అల్లుడుని చంపించేశాడు ఆ యువతి తండ్రి. ప్రేమ.. పరువు గురించి ఆలోచిస్తూ వాటి మధ్య నలిగిపోయిన తండ్రి మానసిక ఆవేదనే ఈ సినిమా రూపకల్పన. ట్రైలర్ ను చూస్తుంటే మళ్లీ ఇన్నాళ్లకు వర్మ తనదైన మార్క్‌తో సినిమా తీశాడా..? అనిపించింది. కాగా, ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి, భార్గవి ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలో ఈ చిత్రం ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల కానుంది.