న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్ డౌన్ సడలింపుల్లో వ్యాప్తి మరింత ఎక్కువైంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య మూడులక్షలకు చేరడంతో తాజాగా భారత్ బ్రిటన్‌ను కూడా బీట్ చేసి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇదే ధోరణి కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే దేశం మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా, లాక్‌డౌన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు ప్రధాని సీఎంలతో వర్చువల్ సమావేశాల్లో పాల్గొంటారని పీఎం కార్యాలయం తెలిపింది. జూన్ 16, 17 వ తేదీల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్‌లు ఉంటాయని శుక్రవారం వెల్లడించింది. కరోనా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడంతో పాటు వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరోసారి లాక్‌డౌన్ విధించాలా అన్న విషయాలపై చర్చించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మూడు లక్షల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరిన ఇండియాలో లాక్ డౌన్ నిబంధనల్లో ఆంక్షలను సడలించిన తర్వాతే కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో అయితే లక్ష కేసులు దాటాయి. కొత్తగా 3,717 నమోదు కాగా అందులో 127మంది చనిపోయారు. ముంబైలో 1,366 కేసులు నమోదుకాగా, 90మంది చనిపోయారు. రెండవ స్థానంలో తమిళనాడు 40,698, ఢిల్లీ 34,687 నిలిచాయి.
దేశవ్యాప్తంగా ఇలా..
దేశవ్యాప్తంగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో 11,458 పాజిటివ్ కేసులు, 386 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,08,993కు చేరింది. వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో 1,45,993 మంది చికిత్స పొందుతుండగా, 1,54,330 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటివరకు 8,884 మంది ప్రాణాలు విడిచారు.