సారథి న్యూస్, అచ్చంపేట: తరాల భూముల తగవులకు ముగింపు పలికేలా, కొత్త తరాలకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా కొత్త చట్టం ఉందని, తెలంగాణ రైతుల కష్టాలు తీర్చడమే ధ్యేయంగా సీఎం రెవెన్యూలో భారీ సంస్కరణలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. నూతన రెవెన్యూ చట్టం అమలు సందర్భంగా.. సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు సంఘీభావం తెలియజేస్తూ శుక్రవారం ఉదయం అచ్చంపేటలో నియోజకవర్గ రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. మనిషికి బతుకునిచ్చిన ఈ నేలకు దశాబ్దాలుగా పడిన సంకెళ్లను తెంచడానికి సీఎం కేసీఆర్సాహసోపేతంగా అడుగు ముందుకేశారని కొనియాడారు. నూతన రెవెన్యూ చట్టం తెలంగాణ అంతటా ఆకాశమంత సంబురాన్ని తెచ్చిందన్నారు. ఎప్పటికీ పరిష్కారం కావనుకున్న సమస్యలు కళ్లముందే పరిష్కారం కావడంతో అద్భుతంగా కనిపిస్తుందన్నారు. దశాబ్దాల బూజుపట్టిన చట్టాలను తిరగరాసి పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు.