న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని భారత ఆర్మీ చీఫ్ నరవాణే అన్నారు. డెహ్రాడూన్‌లో శనివారం జరిగిన ఆర్మీ పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. చైనా కార్ప్స్ కమాండర్ స్థాయిలో శాంతి చర్చలు జరిగాయని, ఆ తర్వాత స్థానిక స్థాయి కమాండర్లతో కూడా మీటింగ్‌లు నిర్వహించామని ఆయన అన్నారు. చైనాతో చర్చలు జరగడం వల్ల సమస్య సద్దుమనిగే అవకాశం ఉందని తెలిపారు. నేపాల్‌తోనూ బలమైన, మంచి రిలేషన్షిప్ ఉందని చెప్పారు. ‘చర్చల ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న తేడాలు సద్దుమణుగుతాయి. అంతా అదుపులోనే ఉంది’ అని నరవాణే స్టేట్‌మెంట్ ఇచ్చారు.
జమ్మూకాశ్మీర్‌లో గత 15 రోజుల్లో 15 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని చెప్పారు. సెక్యూరిటీ ఫోర్స్ మధ్య ఉన్న క్లోజ్ కో ఆర్డినేషన్‌తోనే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు. ‘చాలా మంది టెర్రరిస్టులను స్థానికుల ఇచ్చిన సమాచారంతోనే పట్టుకోగలిగాం. కాశ్మీర్‌లోని ప్రజలంతా టెర్రరిస్టు, వారు చేస్తున్న పనుల వల్ల విసుగు చెందారు. వారంతా సాధారణ పరిస్థితిని కోరుకుంటున్నారు’ అని ఆర్మీ చీఫ్ చెప్పారు. ఇండియా, చైనాకు చెందిన ఆర్మీ అధికారులు శుక్రవారం ఐదో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించుకున్నారు. అంతే కాకుండా లైన్ ఆఫ్ యాచ్చువల్ కంట్రోల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడాఖ్‌లోని సెన్సిటివ్ ప్రాంతాల్లో పరిస్థితిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా రివ్యూ చేశారు.