Breaking News

బీజేపీలో చేరిన మాజీ మేయర్ ​కార్తీకరెడ్డి

బీజేపీలో చేరిన మాజీమేయర్​కార్తీకరెడ్డి

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మాజీ మేయర్, కాంగ్రెస్ నాయకురాలు బండ కార్తీకరెడ్డి తన భర్త చంద్రారెడ్డితో కలిసి బుధవారం బీజేపీలో చేరారు. వారికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భూపేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టడమే తమ లక్ష్యమన్నారు. గ్రేటర్ మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కార్తీకరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు సీటు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి బీజేపీ పనిచేస్తోందని.. తనకు న్యాయం జరుగుతుందనే బీజేపీలో చేరానని చెప్పారు. అయితే ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ఆమె స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారును షెడ్డుకు పంపిస్తే, సారు.. కారు.. సర్కారు.. ఇక రారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఏం జరగబోతుందో దేశం మొత్తం చూస్తోందన్నారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా దుబ్బాకలో బీజేపీని ప్రజలు గెలిపించారని అన్నారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ను మజ్లిస్‌ పార్టీకి అప్పగించారని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో తయారీ, రూపకల్పన, సమస్యలు, సలహాలు, సూచనల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాల్‌సెంటర్‌కు వచ్చే సూచనలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని బండి సంజయ్‌ వివరించారు.