Breaking News

బకాయి జీతం వస్తలేదు

బకాయి జీతం వస్తలేదు

  • కూలి పనులకు వెళ్తున్న విద్యావలంటీర్లు
  • కరోనా ప్రభావంతో బతుకులు ఆగమాగం
  • పెండింగ్ జీతాలైనా ఇవ్వండని వేడుకోలు

:: సుంకే కుమార్,​ కౌడిపల్లి
కరోనా మహమ్మారి మధ్యతరగతి ప్రజల జీవనంపై దెబ్బకొట్టింది. ఓ వైపు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తూ.. మరోవైపు ప్రాణాలను హరించేస్తోంది. ఎంతో మంది తమ జీవనోపాధిని కోల్పోయి బతుకుజీవుడా అని కాలం వెళ్లదీస్తున్నారు. నెలవారి జీతంతో బతికే కుటుంబాల పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడింది. కరోనా పుణ్యమా! అని ఉన్నత చదువులు చదివిన విద్యావలంటీర్లు రోజువారీ కూలీలుగా మారారు. జీతం రాకపోవడంతో బతుకుజీవుడా.. అని కాలం వెళ్లదీస్తున్నారు. నెలలు గడిచేకొద్దీ విద్యావలంటీర్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతోంది. వారిలో కొందరు కూలీ పనులకు వెళ్తుండగా, మరికొందరు తమకు వచ్చిన చేతివృత్తి పనులు చేసుకుంటున్నారు. స్కూళ్లు నడిచిన సమయంలో వచ్చే అరకొర జీతాలతోనే పూట గడిచేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. విద్యావలంటీర్లు రోజువారీ కూలీలుగా మారిపోయారు.

2,210 మంది విద్యావలంటీర్ల ఉపాధిపై దెబ్బ

ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, సీపీఎస్​లో మొత్తం 2,210 మంది విద్యావలంటీర్లను నియమించారు. మెదక్ జిల్లాలో 584, సిద్దిపేట జిల్లాలో 426, సంగారెడ్డి జిల్లాలో 1,200 మంది ఉన్నారు. బీఈడీ, డీఎడ్ ​కోర్సులు పూర్తిచేయడంతో పాటు ఇతర ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడంతో ఖాళీగా ఉండడం ఎందుకని గవర్నమెంట్​ స్కూళ్లలో విద్యావలంటీర్లుగా చేరారు. జీతం తక్కువైనా తాత్కాలికమే అయినా కుటుంబపోషణకు ఎంతోకొంత తోడు ఉంటుందని విద్యావలంటీర్లుగా చేరారు.ఇప్పుడు వారి బతుకుదెరువుపై నీళ్లు చల్లింది.


రూ.4.86 కోట్లు పెండింగ్​
కౌడిపల్లి మండలంలో మొత్తం 60 ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి. అందులో 10 జిల్లా పరిషత్, నాలుగు ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. ప్రస్తుతం 27 మంది విద్యావలంటీర్లు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.12వేల చొప్పున ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి రూ.24వేల పెండింగ్​ఉంది. ఇలా ఉమ్మడి మెదక్​జిల్లాలో సుమారు రూ.4.86కోట్ల జీతాలు బకాయి ఉందని విద్యావలంటీర్లు చెబుతున్నారు. అలాగే జూన్, జులై సంబంధించి స్కూళ్లు తెరవకపోవడంతో ఈ రెండు నెలలు ఉపాధి కోల్పోయినట్టే లెక్క. పెండింగ్​లో జీతాలను ఇవ్వాలని, విద్యావలంటీర్లు డిమాండ్​చేస్తున్నారు.

పూట గడవడమే కష్టమైంది

కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చడంతో స్కూళ్లను రీ ఓపెన్​ చేయడం లేదు. జీతం రాక.. కుటుంబాలు గడవడం లేదు. కూలినాలి పనులు చేసుకుంట ఇంటిని పోషించడం ఇబ్బందిగా మారింది.
ఆశాబీ విద్యా వలంటీర్, కంచన్ పల్లి

ప్రభుత్వం ఆదుకోవాలి
కరోనా కారణంగా స్కూళ్లను మూసివేశారు. ఏ పనిలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. కూలీ పనులకు పోతున్నాం. అది దొరక్కపోతే గొర్లను మేపేందుకు వెళ్తున్నా..ప్రస్తుతం వరినాట్లు వేస్తున్నాం.
వైకుంఠం, విద్యావలంటీర్​, కొట్టాల

పోషణ భారమైంది
ప్రస్తుతం ఏ పనులు దొరుకుత లేవు. కుటుంబం నడవడం చాలా ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్న.
సాహితీ, విద్యావలంటీర్​, కౌడిపల్లి