మెగాస్టార్ చిరంజీవికి జనరేషన్ తో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ‘అన్నయ్య’ అని అందరిచేతా పిలిపించుకునే చిరంజీవి బర్త్ డే ఇటీవలే జరిగింది. దాన్ని పురస్కరించుకుని పలువురు అభిమానులు, టాలీవుడ్ హీరోలు తమకు తోచిన విధంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల, తన భార్య హారికతో కలిసి ‘ఛాలెంజ్’ చిత్రంలోని ‘ఇందువదన’ పాటను రీమిక్స్ చేసి అద్భుతంగా, అందమైన ఆల్బమ్‌గా మలిచారు. సుధాకర్, హారిక డ్యాన్స్ వీడియో యూ ట్యూబ్, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ వీడియోను చూసిన మెగాస్టార్ చిరంజీవి వారి ప్రతిభను, అభిమానాన్ని ప్రశంసిస్తూ తన అభినందనలను ఆడియో రూపంలో విడుదల చేశారు. ఆ ఆడియో ఫైల్‌లో చిరంజీవి కురిపించిన ప్రశంసలు ఇవే..
‘హాయ్ సుధాకర్ కోమాకుల, హారిక.. ఎలా ఉన్నారు? నా పుట్టిన రోజున మీరిచ్చిన విజువల్ ట్రీట్‌కు ధన్యవాదాలు. నా బర్త్ డే రోజున నాకు మీరిచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్ అది. ఆ పాట చూస్తున్నంత సేపు నా గత రోజులు, ఛాలెంజ్ సినిమా రోజులు గుర్తుకు రావడం ఒక ఎత్తు. ఆ పాటను రీ ప్రొడ్యూస్ చేసే క్రమంలో చేసిన ప్రాక్టీస్, నన్ను తలచుకుని వీడియోను రూపొందించి నన్ను ఆకట్టుకునే ప్రయత్నం మరో ఎత్తు. అలాంటి ప్రయత్నంతో మీరు నన్ను ఇంప్రెస్ చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. మీరు ఊహించిన దాని కంటే నన్ను ఎక్కువగా సంతోషపెట్టింది’ అంటూ చిరంజీవి ఆడియోలో పేర్కొన్నారు.
‘మీరు ఇండియాలో ఉంటే కనుక నా సంతోషాన్ని మరో విధంగా తెలిపేవాడిని. మీరు అమెరికాలో ఉండటం వల్ల నేను ఇలా ఆడియో రూపంలో అభినందనలు తెలుపుతున్నాను’ అని ఆడియోలో తెలిపారు. సుధాకర్ దంపతుల టాలెంట్ గురించి మాట్లాడుతూ.. ‘నీవంటే సినిమా హీరోవి. బాగా డ్యాన్స్ చేస్తావని ఊహించగలం. కానీ నీ భార్య హారిక సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. సినిమాకు సంబంధం లేని అమ్మాయి. అలాంటి అమ్మాయి చాలా చక్కగా డ్యాన్స్ చేయడం ఆశ్చర్యంతోపాటు మిక్కిలి ఆనందం కలిగించింది’ అని చిరంజీవి అభినందించారు.
పాటలో నీ భార్య గ్రేస్ అద్భుతం..
‘ఇందువదన పాటలో ప్రత్యేకించి హారిక చూపించిన గ్రేస్‌కు ఎక్కువ మార్కులు వేస్తున్నానని ఏమనుకోకు. అంతా నీ ట్రైనింగ్ అయి ఉంటుంది. మీ దంపతులు చక్కటి సింక్రనైజేషన్‌తో ఎలా అయితే రక్తి కట్టించారో.. అలాంటి సమన్వయంతో, అవగాహనతో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌గా చేసుకొని జీవితాన్ని కొనసాగించాలని కోరుకొంటూ ‘నా గుడ్ విషెస్’ అందజేస్తున్నాను. థ్యాంక్యూ సో మచ్ వన్స్ అగైన్’ అంటూ సుధాకర్ దంపతులను చిరంజీవి ఆశీర్వదించారు.
మీ అభినందన మరింత ఎనర్జీని ఇచ్చింది..
‘ఇందువదన’ పాటను చిరంజీవి బర్త్ డే రోజున తమదైన శైలిలో రూపొందించి అంకితం ఇచ్చిన చిన్న ప్రయత్నానికి మెగాస్టార్ చిరంజీవి అందించిన ప్రశంసలకు సుధాకర్ కోమాకుల దంపతులు థ్రిల్ అయ్యారు. ‘మా ప్రయత్నాన్ని అభినందించినందుకు ధన్యవాదాలు. మీరు మెగాస్టార్ ఎందుకు అయ్యారో ఇంకా క్లారిటీ వచ్చింది. మీ అభినందన మాకు మరింత ఎనర్జీ ఇచ్చింది. మీరు అందించిన స్ఫూర్తితో ఇంకా బాగా కష్టపడతాను. నా డ్యాన్స్ వీడియోను బ్లాక్ బస్టర్ చేసిన మెగా అభిమానులకు ధన్యవాదాలు’ అంటూ సుధాకర్ కోమాకుల ట్వీట్ చేశారు.