సారథి న్యూస్, హైదరాబాద్: ఫోన్‌లు, ట్యాబ్‌లూ మా వద్దే కొనాలి. బయట కొంటే మేం వాటిని అనుమతించం. తప్పనిసరిగా మా దగ్గరే తీసుకోండి. ఈ బెదిరింపులే ఇప్పుడు తల్లిదండ్రులను భయపెడుతున్నాయి. కరోనా కాటుకు విద్యారంగం విలవిల్లాడుతోంది. క్లాసులు జరిగే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. అంతా ఆన్‌లైన్‌లోనే. దీంతో విద్యార్థుల కోసం ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్‌లు కొనాల్సిన పరిస్థితి వచ్చింది. దీనినే కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. గతంలో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, డ్రెస్‌లు, బ్యాగులూ తమ వద్దే కొనాలని షరతులు విధించేవి. ఇప్పుడు వాటి వినియోగం లేకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లు కొత్త వ్యాపారానికి తెరతీశాయి. ఆన్‌లైన్ క్లాసులకు కావాల్సిన సెల్‌ఫోన్లు, ట్యాబ్‌ల వ్యాపారాన్ని మొదలు పెట్టాయి. ఇవి తమవద్ద తీసుకోకుంటే విద్యార్థులకు క్లాసులకు అనుమతించేది లేదని తెగేసి చెబుతున్నాయి. వారివద్ద కొన్న వారికే యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి బయట ఎనిమిది వేలకు దొరికే ఫోన్‌ను పాఠశాలల్లో రూ.పదివేల వరకు అమ్ముతున్నారు. ట్యాబ్‌ల రేటు కూడా బయట మార్కెట్ కన్నా ఎక్కువగానే అమ్ముతున్నారు. బయట కొన్న ఫోన్లు, ట్యాబ్‌లు తమ బోధనకు సరిగా పనిచేయవని, తమ ఆన్‌లైన్ బోధనకు అనుకూలంగా ఉన్న వాటిని తాము అమ్ముతున్నామని, అందుకే వాటిని తమ వద్దనే కొనుగోలు చేయాలని చెబుతూ తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువ ధర పెట్టి పాఠశాలల్లోనే ట్యాబ్‌లు, ఫోన్లు కొంటున్నారు. అయితే, ఇలాంటి అక్రమ వ్యాపారానికి తెరలేపిన పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా..
వాస్తవానికి ఈ ఏడాది విద్యాసంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న విషయాన్ని ప్రభుత్వం ఇప్పటివరకూ ప్రకటించలేదు. ప్రభుత్వం ప్రకటించే వరకూ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులూ కూడా నడపవద్దని సర్కారు ప్రకటించింది. కానీ, ఈ నిబంధనలను తుంగలో తొక్కి అనేక ప్రైవేట్ పాఠశాలలు అడ్మిషన్లు చేసుకోవడంతో పాటు ఆన్‌లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఇప్పటికే అనేక చాప్టర్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మాత్రం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేటు విద్యాలయాల్లో ఆన్‌లైన్ క్లాసులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే తమకు కూడా వెంటనే క్లాసులు జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు.
- July 2, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CELLPHONES
- EDUCATIONS
- TABS
- ఆన్‌లైన్ క్లాసెస్
- నోట్‌బుక్స్
- ప్రైవేట్ స్కూళ్లు
- సెల్‌ఫోన్లు
- Comments Off on ఫోన్లు, ట్యాబ్‌లూ మా వద్దే కొనాలి