సారథి న్యూస్, హైదరాబాద్: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత(డిసెంబర్ 2018)లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎత్తుకున్న ఫెడరల్ ఫ్రంట్ నినాదం.. ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. నిధులు, అధికారాల విషయంలో అప్పట్లో కేంద్రంపై విమర్శలు గుప్పించిన సీఎం.. ఆ తర్వాత నుంచి మిన్న కుండిపోతున్నారు. అడపాదడపా ప్రధాని మోడీ సర్కారు తీరుపై దండెత్తినట్టు వ్యవహరిస్తున్నా.. అవన్నీ ప్రెస్‌మీట్లు, మాటలకే పరిమితమవుతున్నాయే తప్ప ఆచరణలో కనిపించడం లేదని రాజకీయ విమర్శకులు అంటున్నారు. కరోనా విజృంభణ, ఫలితంగా లాక్‌డౌన్, దానివల్ల రాష్ట్రాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రస్తుత తరుణంలో సమాఖ్య స్ఫూర్తిపై చిత్తశుద్ధిని ఇప్పుడే ప్రదర్శించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ ఉధృతి పెరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం.. తక్షణమే వెయ్యి వెంటిలేటర్లను తమకు పంపించాలని కేంద్రాన్ని కోరింది. కానీ మోడీ సర్కార్ మాత్రం కేవలం 50 వెంటిలేటర్లను మాత్రమే అందజేసి చేతులు దులుపుకుంది. పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కుల విషయంలోనూ ఇదే తీరుగా కేంద్రం వ్యవహరించింది. 2 లక్షల ఎన్-95 మాస్కులు, పరిమిత సంఖ్యలో పీపీఈ కిట్లు ఇచ్చి ‘మీ చావు మీరు చావండంటూ’ వదిలేసింది. దీంతోపాటు రోజుకు 3వేల నుంచి 4వేల కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం ఉన్న ‘కొబాస్-8800’ మిషన్‌ను తెలంగాణకు కాకుండా పశ్చిమ బంగాకు కేంద్రం పంపింది.
కడుపునింపని ‘ఆత్మ నిర్భర్ ప్యాకేజీ’
వాస్తవానికి సంబంధిత మిషన్ల తయారీ కంపెనీ మన రాష్ట్రానికి ఒక మిషన్‌ను ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించింది. దాంతోపాటు మరో మిషన్‌ను కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ బెంగాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయన్న కారణంతో ఐసీఎంఆర్ పేరు మీద కేంద్రం ఉచితంగా రావాల్సిన మిషన్‌ను ఆ రాష్ట్రానికి తరలించింది. దీనిపై సీఎం కేసీఆర్ ఇప్పటివరకూ స్పందించలేదన్న విమర్శ ఉంది. మరోవైపు ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు పెద్దగా ఆర్థిక సాయం అందిందేమీ లేదు. ఆత్మ నిర్భర్ పేరిట ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల పేదలు, వలస కూలీలు, వ్యవసాయ కార్మికులు, సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. ఈ విషయాలన్నింటిపై కేంద్రాన్ని నిలదీయాల్సిన ఉండగా, మౌనంగా ఉండిపోయారన్న అపవాదు ఉంది.
గతంలో ఫెడరల్ ఫ్రంట్, శక్తివంతమైన రాష్ట్రాలు, వాటి హక్కుల కోసం పోరాటాలు.. తదితర అంశాల గురించి మాట్లాడిన సీఎం, కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రాల తరఫున ఎందుకు గళం విప్పడం లేదనే విమర్శలు వెల్లువెతున్నాయి. కేంద్రంపై పోరుకు సదావకాశం వచ్చిన సమయంలో.. ఆయన దాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రాల హక్కులు, సమాఖ్య స్ఫూర్తి కోసం నిలబడిన కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.