Breaking News

ప్లాస్మాథెరపీతో ప్రయోజనం శూన్యం

ప్లాస్మాతో ప్రయోజనం శూన్యం

ఢిల్లీ: ప్లాస్మా థెరపీతో ఏ విధమైన ప్రయోజనం లేదని.. ఈ విధానంతో మరణాలను తగ్గించలేకపోతున్నామని ఎయిమ్స్​ డైరెక్టర్ రణ్​దీప్​ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిమ్స్​ చేసిన ప్రాథమిక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. బుధవారం ఢిల్లీలో నేషనల్ క్లినికల్ గ్రాండ్ రౌండ్స్ ‘కరోనా కట్టడిలో ప్లాస్మా థెరపీ పాత్ర’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సదస్సులో గులేరియా మాట్లాడారు. ఎయిమ్స్‌లో జరిపిన ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయిల్స్‌లో ఈ విషయం వెల్లడైందన్నారు. ఎయిమ్స్‌లో 30 మంది కరోనా పేషెంట్లపై చేపట్టిన ట్రయల్స్‌లో ప్లాస్మా థెరపీ ద్వారా మరణాల శాతాన్ని తగ్గించలేకపోయామని ఆయన చెప్పారు. ఈ ట్రయల్స్‌ భాగంగా కరోనా పేషెంట్లను రెండు బృందాలుగా విభజించి వారిలో ఒక బృందానికి రెగ్యూలర్ చికిత్స, మరో బృందానికి ప్లాస్మా థెరపీ చికిత్స అందించినట్టు ఆయన తెలిపారు. అయితే రెండు బృందాల్లోనూ మరణాల శాతం సమానంగా ఉందని వెల్లడించారు. అయితే ఇది కేవలం మధ్యంతర విశ్లేషణ మాత్రమే అని దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని గులేరియా చెప్పారు.