Breaking News

ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉంటే చాలు

ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉంటే చాలు

‘అష్టాచమ్మా’ మూవీతో టాలీవుడ్​లోకి అడుగుపెట్టి.. స్మైల్ తో అందర్నీ కట్టపడేసి.. డిఫరెంట్ నటనతో తనదైన ముద్ర వేసుకున్న నాని ఇప్పుడు విలన్ గా డిఫరెంట్ గెటప్ తో ‘వీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సందర్భంగా నాని ముచ్చటించిన విషయాలు.
‘వి’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాపై అందరూ చాలా అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్ లోనే రిలీజ్ చేయాలనుకున్నాం. పరిస్థితుల ప్రభావంతో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. ఇదో కొత్త ఎక్స్ పీరియన్స్. కానీ ప్రతి ఒక్కరికీ థియేటర్ లో చూస్తేనే బాగుంటుందనే ఫీలింగ్ లో ఉన్నారు.
ముగ్గురం క్లాస్ మెట్స్ లా ఉంటాం
ఇది నా 25వ సినిమా అయినా ప్లాన్డ్ గా ఏమీ చేయలేదు. 24వ సినిమా ఎలా చేశానో.. ఇది అంతే. ఇంతవరకూ ఎదిగానంటే అభిమానుల ఆశీర్వచనాలే కారణం. మున్ముందు మరింత ఆదరిస్తారనుకుంటున్నా. ఇంద్రగంటితో మూడు సినిమాలు చేసినా ఆయనలో కానీ, నాలో కానీ ఎలాంటి మార్పు లేదు. ‘అష్టాచమ్మా’ నుంచి ట్రావెల్ అయిన వారిలో నేను, ఇంద్రగంటి, కెమెరామెన్ విందా ముగ్గురం కలిసి పెరిగిన క్లాస్ మెట్స్ లా ఉంటాం.
స్ర్కిప్ట్​విన్నప్పుడే చాలా ఇన్ స్పైయిర్ అయ్యాను. ప్రతి సీనూ రెగ్యులర్ గా చేసే సినిమాల కన్నా ఎక్కువ ఎంజాయ్ చేశాను. అష్టాచమ్మా విడుదలైన సెప్టెంబర్ 5నే ‘వి’రిలీజ్ చేయాలనేది అమెజాన్ వాళ్ల ఐడియా. రెండొందల దేశాల్లో సినిమా రీచ్ అవుతుందంటే చాలా హ్యాపీగా ఉంది. పదిరోజులపాటు థియేటర్ లో చూసేవాళ్లంతా ఒక్కరోజులోనే ఓటీటీ ద్వారా చూసేస్తారు.
మల్టీస్టారర్ సినిమాలా ఫీలవను..
రెగ్యులర్ సినిమాలో నేను కనిపించకపోయినా సినిమా అంతా ఉంటాను. సినిమా స్టార్ట్ అయ్యాక ఇరవై నిమిషాల తర్వాత కనిపిస్తాను. మల్టీస్టారర్ సినిమాలా ఫీలవను. పాత్రల మధ్య డిఫరెన్స్ మాత్రమే పట్టించుకుంటా. సుధీర్ సీన్స్ ను చూసినప్పుడు బాగా చేశాడనిపించింది. రక్షకుడికి, రాక్షసుడికి మధ్య పోరాటమే ఈ మూవీ. ట్విస్టులు, షాకులు ఏమీ ఉండవు. సెలబ్రిటీ పోలీస్ ఆఫీసర్ లైఫ్ లోకి ఒకడు వచ్చి డిస్ట్రబ్ చేస్తాడు.. ఆ తర్వాత అతని లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అనేది సినిమా. అదితిరావు హైదరి క్యారెక్టర్ కూడా సినిమాకి హైలైట్ గా ఉంటుంది.
సినిమా చూస్తేనే నెగిటివ్ తెలుస్తుంది
ఐదుసార్లు సినిమా చూశాను.. ఐదంటే రోమన్ నంబర్స్ లో ‘వి’. నా ప్రతి సినిమాను 8.45 ఐమాక్స్ లో చూడడం నాకు సెంటిమెంట్. ఈసారి ఆ చాన్స్ లేదు. టీవీలోనే చూడాలి. ప్రివ్యూ థియేటర్ బుక్ చేసి ఫ్యామిలీకి సినిమా చూపించాను. నా పాత్ర ఎంత నెగిటివ్ అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో అందరూ విలన్స్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బ్యాడ్ బాయ్స్ కే ఫాలోయింగ్ ఉంది.
ఎదురుచూసి నీరసం వచ్చేసింది
ఉగాది కానుకగా మార్చిలో విడుదల కావాల్సిన సినిమా ఇది. రిలీజ్ కు ముందు జనతా కర్ఫూ వచ్చింది.. ఒక్కరోజే అనుకున్నాం.. తర్వాత 21 రోజులు మొదలు ఇక్కడ వరకు వచ్చింది. దీంతో రిలీజ్ విషయంలో బాగా డిసాపాయింట్​ అయ్యాం. ఎప్పుడెప్పుడు ఆడియెన్స్ కు చూపిస్తామా? అని ఎదురుచూసి నాకు నీరసం వచ్చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీనే కరెక్ట్ నిర్ణయం. ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్నిరకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఆయన చాలామందికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి. ప్రస్తుత పరిస్థితుల్లో రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధంగానే ఉన్నా. సినిమాకు బిజినెస్ తగ్గితే కచ్చితంగా తగ్గించుకోవాలి. సినిమాల వల్ల ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉంటే చాలు. పరిస్థితులను బట్టి సర్దుకుపోవాలి.
ఎంతో నేర్చుకోవాలనుకున్నా.. కానీ
లాక్ డౌన్ లో చాలా నేర్చుకోవాలనుకున్నా.. కానీ ఏం నేర్చుకోలేదు.. అమ్మ దగ్గర వంట నేర్చుకుందామనుకున్నా. అవ్వలేదు.. సిక్స్ ప్యాక్ చేసేద్దామనుకున్నా.. కానీ తినడం.. పడుకోవడం తప్ప ఏం చేయలేదు. నా సన్ జున్నుతో బాగా స్పెండ్ చేస్తున్నా. ఆరు నెలలు కంప్లీట్ టైమ్ వాడితోనే గడిపేశాను. షూటింగ్ కి వెళ్తే ఎలా ఉంటుందో మరి.
బాలీవుడ్ లో నటించాలని లేదు
ఇప్పటికే చాలా రోజులు వెయిట్ చేశాం. పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. కొంతమంది పనిచేస్తే కానీ రోజులు గడవని పరిస్థితి ఉంటుంది. మనం ఎంత హెల్ప్ చేసినా అది నామమాత్రమే. జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లడమే బెటర్. స్ర్కిప్ట్ ఇన్ స్పైయిర్ అయితే ఎలాంటి సినిమా అయినా చేస్తాను. బాలీవుడ్ లో నటించాలని లేదు.. తెలుగు సినిమాకే ప్రాధాన్యం ఇస్తాను. కథ బాగుంటే హిందీ మూవీ చేస్తాను. స్ర్కిప్ట్ నచ్చితే వెంటనే ఓకే చెప్తాను. జెర్సీ కథకూడా విన్న వెంటనే ఓకే చెప్పాను. ఇప్పుడు ‘వి’అలాగే చెప్పాను. 2022వరకు చేతిలో సినిమాలు ఉన్నాయి. ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’ తో పాటు ఒక డెబ్యూ డైరెక్టర్ తో, మరో దర్శకుడితో ఓ సినిమా చేయాల్సి ఉంది. టక్ జగదీష్ 50 శాతం పూర్తయింది. శ్యామ్ సింగరాయ్ ప్రి ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. టక్ జగదీష్ పూర్తవగానే ఇది మొదలుపెడతాం.