సారథి న్యూస్, హైదరాబాద్: నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు, డెయిలీ వేజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ప్ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాలను పెంచుతామని సీఎం ప్రకటించారు. అన్నిశాఖల ఉద్యోగులు కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా జీతాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపు వల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు.
ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాలు
అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని ముఖ్యమంత్రి నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుంచి అందిన నివేదికను అధ్యయనం చేస్తుంది. రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతుంది. వేతన సవరణ ఎంత చేయాలి? ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలి? సర్వీసు నిబంధనలు ఎలా రూపొందించాలి? పదోన్నతులకు అనుసరించాల్సిన మార్గమేమిటి? జోనల్ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి? తదితర అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం క్యాబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఉద్యోగుల పాత్ర గొప్పది
‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు టీఎన్జీవో పేరుతో తెలంగాణ అస్తిత్వాన్ని గొప్పగా నిలుపుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రం అవుతుందని అంచనా వేశాం. అప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగులకు మంచి వేతనాలు ఇవ్వొచ్చని భావించాం. అనుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారింది. ఇప్పుడు మరోసారి ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతామని టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలనే విషయంలో అధికారుల కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చిస్తుంది. అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
‘సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అంశం చిక్కుముడిగానే ఉండేది. ఏది ముట్టుకున్నా పంచాయితీ, కోర్టు కేసులే ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అవి కొనసాగాయి. ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపి, న్యాయ వివాదాలను పరిష్కరించుకుని ఇప్పుడిప్పుడే అన్ని విషయాల్లో స్పష్టతకు వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా విధులు నిర్వర్తించే సౌలభ్యం కల్పించడానికి మార్గం సుగమమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిష్కరించాలి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మొత్తం ప్రక్రియ పూర్తికావాలి. మార్చి నుంచి ఉద్యోగులంతా అన్నిరకాల సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి కావాలి’’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఖాళీపోస్టులను భర్తీచేయండి
‘ఆంధ్రప్రదేశ్ తో వివాదం కారణంగా పోలీసు, రెవెన్యూ తదితర శాఖల్లో పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆ గొడవలన్నీ పరిష్కారమయ్యాయి. కాబట్టి వెంటనే అన్ని శాఖల్లో పదోన్నతులు ఇవ్వాలి. అన్నిశాఖల్లో వెంటనే డీపీసీలు నియమించాలి. పదోన్నతులు ఇవ్వగా ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు ఇచ్చిన తర్వాత ఎన్ని ఖాళీలుంటాయనే విషయంలో స్పష్టత వస్తుంది. శాఖలవారీగా ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి మాసంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభించాలి’ అని సీఎం ఆదేశించారు.
ఈజీగా సర్వీస్ రూల్స్
‘ప్రతి ఉద్యోగి తాను ఉద్యోగంలో చేరిన నాడే తాను ఏ సమయానికి పదోన్నతి పొందుతాడో తెలిసి ఉండాలి. రిటైర్ అయ్యే నాటికి ఏ స్థాయికి వెళతాడో స్పష్టత ఉండాలి. దీనికి అనుగుణంగా చాలా సరళమైన రీతిలో ఉద్యోగుల సర్వీసు రూల్స్ రూపొందించాలి. పదోన్నతుల కోసం ఎవరివద్దా పైరవీ చేసే దుస్థితి ఉండొద్దు. ఏ ఆఫీసుకూ తిరిగే అవసరం రావొద్దు. సమయానికి ఉద్యోగికి రావల్సిన ప్రమోషన్ ఆర్డర్ వచ్చి తీరాలి. ఉద్యోగులకు తమ కెరీర్ విషయంలో అంతా స్పష్టత ఉండే విధంగా సర్వీస్ రూల్స్ ఉండాలి. ఆయా శాఖల్లో శాఖాధిపతులు ఉద్యోగుల సంక్షేమాన్ని కచ్చితంగా పట్టించుకోవాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించే కారుణ్య నియామకాల విషయంలో జాప్యం జరగడం అత్యంత విషాదకరమని, దు:ఖంలో ఉన్న కుటుంబం ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం పడొద్దన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో వెంటనే కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
- December 30, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- EMPLOYES RULES
- TELANGANA
- తెలంగాణ
- ప్రభుత్వ ఉద్యోగులు
- సీఎం కేసీఆర్
- Comments Off on ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం గుడ్న్యూస్