సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్నిఅంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎన్ని రోజులైనా సరే, అన్ని రాజకీయపక్షాలు ప్రతిపాదించిన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈనెల 7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ మంత్రులు, విప్ లతో గురువారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు.
మంత్రులు సన్నద్ధమై రావాలి
కరోనా వ్యాప్తి నివారణ, బాధితులకు అందుతున్న వైద్యం, రాష్ట్రంలో విస్తరించిన వైద్యసేవలు, భారీవర్షాలకు పంటనష్టం.. తీసుకోవాల్సిన చర్యలు, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, కొత్త రెవెన్యూ చట్టం, రాయలసీమ ఎత్తిపోతల పథకం పేర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు, నీటిపారుదల రంగానికి సంబంధించిన అంశాలు, జీఎస్టీ అమలులో అన్యాయం, కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్థిక విధానాల వల్ల నష్టం, రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాల విషయంలో కేంద్ర ప్రభుత్వ నాన్చివేత ధోరణి, నియంత్రిత పద్ధతిలో పంట సాగుతో పాటు వ్యవసాయ రంగం, దివంగత ప్రధాని పీవీ శతజయంతి ఉత్సవాలు.. తదితర అంశాలను చర్చించాలని నిర్ణయించారు. చర్చకు సిద్ధమైన అంశాలను బీఏసీ సమావేశంలో ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే రామలింగారెడ్డికి అసెంబ్లీలో మొదటి రోజే ఘన నివాళి అర్పించనున్నట్లు సీఎం కేసీఆర్తెలిపారు. అన్ని అంశాలపై సంపూర్ణమైన సమాచారంతో మంత్రులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ప్రజాస్వామ్య విలువలు పరిఢవిల్లేలా చర్చ
ప్రజాస్వామ్య విలువలు పరిఢవిల్లేలా అసెంబ్లీ సమావేశాలు జరగాలన్నారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా తెలంగాణ శాసనసభను నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, చట్టాలు అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉందో సభ్యులు విశ్లేషించాలని, ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా సభ్యులు ప్రస్తావించాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు, గందరగోళం, తిట్లు, శాపనార్థాలు కాదని, పనికిమాలిన నిందలు వేసుకోవడానికి, అసహనం ప్రదర్శించడానికి వేదిక కాకూడదన్నారు. సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కె.తారక రామారావు, టి.హరీశ్ రావు, ఈటల రాజేందర్, జి.జగదీష్ రెడ్డి, ఎస్.నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితాఇంద్రారెడ్డి, శాసన మండలిలో చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ లు ప్రభాకర్, భానుప్రసాద్, కె.దామోదర్ రెడ్డి, అసెంబ్లీలో చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, విప్ లు గంప గోవర్థన్, గొంగిడి సునిత, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, అరికపూడి గాంధి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.
- September 3, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ASSEMBLY SESSIONS
- CM KCR
- TELANGANA
- అసెంబ్లీ సమావేశాలు
- తెలంగాణ
- సీఎం కేసీఆర్
- Comments Off on ప్రజాసమస్యలపై సంపూర్ణంగా చర్చిద్దాం