Breaking News

ప్చ్​.. సన్​రైజర్స్​!

ప్చ్​.. సన్​రైజర్స్​!

దుబాయ్‌: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్ ​వేదికగా జరిగిన 29వ మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ (ఎస్​ఆర్​హెచ్​)పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్​కే) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కోరు తక్కువే అయినా చివరిలో హైదరాబాద్ ​బ్యాట్స్​మెన్లు తడబాటుతో ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ ​బాటపట్టి చివరికి పరాజయం మూటగట్టుకున్నారు. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 168 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. బ్యాట్స్​మెన్లు సామ్‌ కరాన్‌(31; 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షేన్‌ వాట్సన్‌(42; 38 బంతుల్లో ఫోర్‌, 3 సిక్స్‌లు), అంబటి రాయుడు(41; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు) రాణించారు. అయితే సీఎస్‌కేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డుప్లెసిస్‌ ఆడిన తొలి బంతికే గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. చివర్లో ధోని(21; 13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌), జడేజా(25 నాటౌట్‌; 10 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌)లు ఆకట్టుకోవడంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, నటరాజన్‌ ఒక్కొక్కరు రెండు వికెట్ల చొప్పున తీశారు.

లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్ ​హైదరాబాద్ కెప్టెన్​ వార్నర్ 9 పరుగులకే వెనుదిరిగాడు. బెయిర్​ స్టో (23, 24 బంతుల్లో 2 ఫోర్లు) ఇన్నింగ్స్​ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. ఆ తర్వాత వచ్చిన విలియమ్​సన్ ​(57, 39 బంతుల్లో 7×4), ప్రియమ్​గార్గ్​(16)తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఆ తర్వాత శంకర్​(12), రషీద్​ఖాన్(15), నదిమ్​(6).. ఇలా ఒకరి తర్వాత మరొకరు వికెట్ల ముందు బోల్తాపడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకే సన్​రైజర్స్​ హైదరాబాద్ జట్టు అలౌట్​ అయింది. ఇక సీఎస్​కే బౌలర్లలో బ్రావో, శర్మ రెండేసి వికెట్ల చొప్పున తీశారు. కరణ్, జడేజా, ఠాకూర్ ​ఒక్కో వికెట్​ చొప్పున తీశారు.