Breaking News

పోస్టులోనే రైతుల ఇంటికి పట్టా బుక్కులు

పోస్టులోనే రైతుల ఇంటికి పట్టా బుక్కులు

సారథి న్యూస్, మెదక్: రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిందని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. ఈ చట్టం ప్రకారం తహసీల్దార్ ​ఆఫీసుల్లోనే అన్ని పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. అలాగే భూమిని కొన్నా, అమ్మినా తహసీల్దార్​ల సమక్షంలోనే చేస్తారని, వాటికి సంబంధించిన పట్టాదారు పాస్​పుస్తకాలు, రిజిస్ట్రేషన్ ​పేపర్లు పోస్టులోనే రైతుల ఇంటికి వస్తాయని తెలిపారు. దీనికోసం రైతులు గతంలో మాదిరిగా ఆఫీసుల చుట్టూ తిరిగాల్సిన పనిలేదన్నారు. బుధవారం మెదక్ ​జిల్లా చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన 400 మంది రైతులకు డిజిటల్​ సంతకంతో కూడిన పట్టాదారు పాస్​బుక్కులను చేగుంటలోని సాయిబాలాజీ ఫంక్షన్​హాల్​లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. ఆరేళ్ల కాలంలో రైతుల కోసం పాటుపడిన ప్రభుత్వం తమదేనని స్పష్టంచేశారు. ప్రస్తుతం నూతన రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి సాహసోపేత నిర్ణయం తీసుకున్న ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందన్నారు. మెదక్​ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి మాట్లాడుతూ కొత్త రెవెన్యూచట్టం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్​ఎంతో మేలు చేశారని అన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్, నారాయణఖేడ్ ​ఎమ్మెల్యేలు మదన్​రెడ్డి, భూపాల్​రెడ్డి, మెదక్ ​జిల్లా అడిషనల్ ​కలెక్టర్ ​వెంకటేశ్వర్లు, తూప్రాన్ ​ఆర్డీవో శ్యాంప్రకాశ్, చేగుంట, నార్సింగి మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్​లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.