- దరఖాస్తుచేసుకున్న వారం లోపే రేషన్‌కార్డుల్లో పేర్లు ఎంట్రీ
- 1.50 కోట్ల కార్డుల్లో 4.34 కోట్ల మంది పేర్లు
- గతంలో కార్డుల్లో పేర్లు నమోదుకు అనుమతి నిరాకరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం కార్డుల్లో కొత్తగా కుటుంబసభ్యుల పేర్లు నమోదు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పలుకారణాలతో పేర్లు నమోదు కాకపోవడం, కొత్తగా జన్మించిన వారి పేర్లు ఎంట్రీ చేయకపోవడంతో కార్డుదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారంలోపే కార్డుల్లో పేర్లు నమోదు చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో 11.88 లక్షల మంది పేర్లు బియ్యం కార్డుల్లో కొత్తగా నమోదు చేశారు. గతంలో మీ సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ఏళ్లు గడిచినా వాటికి సమాధానం దొరికేది కాదు. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి పేదలు ఉపశమనం పొందారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది, లేదా గ్రామ వలంటీర్‌కు పేరు నమోదు చేయాల్సిన వ్యక్తి ఆధార్ తదితర వివరాలు ఇస్తే సరిపోతుంది.
పేదలకు ఊరట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 1.5 కోట్లకు పైగా బియ్యం కార్డులు ఉన్నాయి. అందులో 4.33 కోట్లకు పైగా పేర్లు నమోదై ఉన్నాయి. కరోనా కారణంగా ఉపాధి దొరకపోవడంతో కుటుంబంలో ఒక్కో సభ్యుడికి నెలకు 10 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగాప్రభుత్వం పంపిణీ చేస్తోంది. కొత్తగా పేర్లు నమోదుకు అవకాశమివ్వడంతో ప్రతినెలా ఆ మేరకు సరుకులు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.