Breaking News

పెరిగిన తుమ్ముల టెన్షన్‌

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలుగు రాష్ట్రాల వాసులకు తుమ్ము టెన్షన్‌ పట్టుకుంది. తుమ్ములతో ఎందుకు టెన్షన్‌ పడుతున్నారనేగా మీ ప్రశ్న. అదేనండి.. ఇది కరోనా కాలం కదా. అందుకేనండి అవంటే అందరూ భయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మార్చి మొదటి వారంనుంచే కరోనా ప్రవేశించింది. ఈ వైరస్‌ సోకిన వారిలో ప్రధానంగా దగ్గు, తుమ్ములు, మక్కు కారడం, గొంతునొప్పి, జ్వరం ప్రధాన లక్షణాలను వైద్యులు చెబుతున్నారు. మొన్నటి వరకు ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి కరోనా సోకినట్టుగానే భావించారు. వారికి టెస్టులు చేసి వ్యాధి సోకిన వారికి చికిత్స అందించారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది.

ఎండాకాలం నుంచి వానాకాలం వచ్చింది. రుతుపవనాలు కూడా ముందుగానే రావడంతో వర్షాలు కూడా భారీగానే పడుతున్నాయి. దీంతో చాలామందికి జలుబు, దగ్గులాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు వర్షానికి తడిచి ఎవరైనా తుమ్మినా, దగ్గినా అతడిని అనుమానంగా, భయంగా చూస్తున్నారు. అది సాధారణమైందే అయినా, అతడికి కరోనా ఉందేమోనన్న భయంతో జనం అల్లకల్లోలం అవుతున్నారు. వర్షం ప్రభావంతో ఇలా తుమ్మేవారు, దగ్గేవారు ఎక్కువమంది అయ్యారు. వీరంతా ఎక్కడ తమను కరోనా బాధితులుగా భావించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తారోనని, తమను ఎక్కడ క్వారంటైన్‌కు పంపుతారోనని ఆందోళనగా ఉన్నారు. సో, సాధారణంగా వస్తున్న తుమ్ములు, దగ్గు వల్ల ఇతరులే కాకుండా, తుమ్మినవారు, దగ్గిన వారు కూడా ఆందోళనకు గురవుతున్నారు. సో, తుమ్ములు, దగ్గులు ఇలా జనాలను టెన్షన్‌కు గురిచేస్తున్నాయన్న మాట.