- శతజయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్
సారథి న్యూస్, హైదరాబాద్: దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, గొప్ప సంస్కరణ శీలి అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు కొనియాడారు. సంస్కరణలకు పీవీ నిలువెత్తు రూపమని కీర్తించారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులో పీవీ శతజయంతి ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశచరిత్రను ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి అని, పీవీ తెలంగాణ బిడ్డ అయినందుకు గర్వంగా ఉందన్నారు. మన పీవీ.. తెలంగాణ ఠీవీ అని కొనియాడారు. భూసంస్కరణలు తీసుకొచ్చి ఎంతో మంది పేదలకు న్యాయం చేశారన్నారు. 360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి అని, ఏ రంగంలో ఉన్నా సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, ఈటల రాజేందర్, మహమూద్‌అలీ, వి.శ్రీనివాస్ గౌడ్, చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేశవరావు, జోగినిపల్లి సంతోష్ కుమార్ రావు, ఎమ్మెల్సీ పి.సుధాకర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, నల్లగొండ ఎంపీ, పీసీపీ చీఫ్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.