- తెలంగాణ ముద్దుబిడ్డకు భారతరత్న ఇవ్వాల్సిందే
- కాలం విసిరిన సంకెళ్లతో ముందుకెళ్లారు
- ప్రతిభాశాలి, రాజకీయాల్లో మేరునగధీరుడు
- అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
సారథి న్యూస్, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోరారు. పీవీ మన ఠీవీ, ఆర్థిక విధానాల సృష్టికర్త అని కొనియాడారు. ఏడాది కాలం పాటు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడాడారు. దేశానికి పీవీ నరసింహారావు చేసిన సేవలను కొనియాడారు. పీవీ గ్లోబల్ఇండియా నిర్మాత అని, దేశం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో దేశానికి ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. ఎన్నో గొప్ప సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని, భూస్వాములు ఏమనుకున్నా 1972లో భూసంస్కరణలను అమలుచేశారని, తనకు ఉన్న సొంత భూమి 800 ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేశారని వివరించారు.
అసాధారణ ప్రతిభాశాలి.. మన పీవీ
పీవీ అసాధారణ ప్రతిభాశాలి అని, హిందీ, తెలుగు, మరాఠి, ఇంగ్లీష్, సంస్కృతం, ఉర్దూ.. తదితర భారతీయ భాషల్లో పాండిత్యం ఉందని వివరించారు. విశ్వనాథ సత్యనారాయణవారు రచించిన వెయి పడగలు నవలను ‘సహస్రఫణ్’పేరుతో హిందీలోకి అనువదించారని చెప్పారు. దివంగత ప్రధాని జవహర్ లాల్‌నెహ్రూ తర్వాత.. మోడ్రన్ ఇండియా కోసం పీవీ నరసింహారావు విశేషంగా కృషిచేశారని కొనియాడారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా.. కాలం విసిరిన సంకెళ్లతో ముందుకెళ్తూ, నూతన ఆర్థిక సంస్కరణలకు రూపకల్పన చేశారని చెప్పారు. ప్రైవేట్ భాగస్వామ్యం పెంచారని, చైనా, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో దౌత్యసంబంధాలను మెరుగుపరిచారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. పంజాబ్పాక్, ఇండోచైనా సరిహద్దుల్లో ఉగ్రవాదం పీచమణిచారని వివరించారు. ఆయన సంస్కరణలు అనే వృక్షాలను నాటితే మన వాటి ఫలితాలను అనుభవిస్తున్నామని అన్నారు.
భావిభారత భవిష్యత్ కోసం తపించారు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా గురుకులాలు, దేశప్రధానిగా నవోదయ విద్యాలయాలను స్థాపించి గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన చదువులను చేరువ చేశారని కొనియాడారు. 7, 10వ తరగతి వరకు డిటెన్షన్ విధానాన్ని రద్దుచేసి రేపటి భావితరం బాలకార్మికులుగా మిగలకూడదని సంకల్పించారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. విశ్వనాథ సత్యనారాయణ, సి.నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ పురస్కారాలు లభించడం వెనుక, కాళోజి నారాయణ రావు గారికి పద్మవిభూషణ్ బిరుదు రావడం వెనక పీవీ కృషి దాగి ఉందన్నారు. మనవాళ్ల ప్రతిభ జాతీయ స్థాయిలో వెలుగులోకి రావడానికి పీవీయే వారధి అయ్యారని కొనియాడారు.
నిజాం వ్యతిరేకంగా ఉద్యమం
ఒక చిన్న గ్రామంలో పుట్టి, విద్యార్థి దశలోనే నిజాం రాజుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసినందుకు, విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణ చేసినాకూడా పీవీ గారు వెరవలేదు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర వెళ్లి నాగపూర్, పుణెలో ఇంటర్, బీఎస్సీ, లా డిగ్రీల్లో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. ఆనాడు ప్రముఖ న్యాయవాది, గొప్ప రాజకీయవేత్త అయిన బూర్గుల రాంకిషన్ రావు వద్ద జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటికీ పీవీ పత్రికా సంపాదకత్వం పట్ల, రామానందతీర్థ నాయకత్వంలోని స్వతంత్ర పోరాటం పట్లనే మొగ్గు చూపించారు. అద్భుతమైన గ్రహణ, ధారణశక్తి పీవీ సొంతం. మహత్మాగాంధీ, నెహ్రూ పట్ల ఆరాధనాభావం, అసమాన పాండిత్యం, అసాధారణమైన అభివ్యక్తి, సృజనశీలం ఆయనను ఉన్నత పథంలో నడిపించాయి. 1991లో ఎన్నికల్లో పోటీచేయకుండా హైదరాబాద్ కు తిరిగి రావడానికి సిద్ధంగా ఉండిన పీవీ రాజీవ్ గాంధీ దారుణ హత్యానంతరం అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షులై, దేశ ప్రధానిగా సర్వోన్నతమైన పదవిని అధిష్ఠించారు.
పీవీని గౌరవించుకుందాం
ప్రధానిగా భారత దేశాన్ని ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో అసమానమైన ప్రతిభతో పాటూ విమర్శలకు వెరవని సాహసం ప్రదర్శించారు. అలాంటి మహనీయుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, ప్రపంచమేధావి, బహుభాషావేత్త, అపర చాణక్యుడికి, ప్రగతిశీలికి, సంపన్న భారత నిర్మాతకు జాతిరత్నమై భాసిల్లిన నాయకుడికి మరణానంతరం ‘భారతరత్న’ పురస్కారం ఇచ్చి భారతజాతి తనను తాను గౌరవించుకోవాలి. ఇప్పటికే ఆలస్యమైంది. పీవీ శతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న ఈ సందర్భంలో వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ప్రకటించడం సముచితంగా ఉంటుంది.
భారత రాజకీయాల్లో మేరునగధీరుడు
తెలంగాణ బిడ్డ, దక్షిణాదినుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థికసంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతికోవిదులు, బహుభాషావేత్త, దేశప్రగతికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాల్లో మేరునగధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని, పార్లమెంట్ ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహం, చిత్తరువునూ ప్రతిష్ఠించాలని, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.