- వెబ్సైట్లలో నీతి కథలు, ఇతిహాసాలు
- చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానం
సారథి న్యూస్, రామాయంపేట: కరోనా పుణ్యమా..! అని విద్యార్థులు చదువులు, పరీక్షలు మానేసి ఆన్ లైన్గేమ్స్ తో స్టూడెంట్స్ కుస్తీ పడుతున్నారు. పిల్లలు ఇంట్లో ఉన్న డాడీ లేదా మమ్మీ స్మార్ట్ ఫోన్లలో లేదా ఇంట్లో ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్ నెట్ ప్రపంచాన్నే చుట్టేస్తున్నారు. ఆన్లైన్ లో పిల్లలు ఏవేవో చూసి సమయాన్ని వృథాచేసుకునే బదులు నైతిక విలువలు, మన సంస్కృతి సంప్రదాయలను నేర్పించే మంచి నీతికథలు, తెలుగు పద్యాలు, ఇతిహాసాలు, మహనీయుల జీవిత చరిత్రలను వెబ్సైట్లలో చదివిద్దాం..
వీడియో గేమ్స్పిల్లల ఆరోగ్యంపై ప్రభావం
ఇటీవల కాలంలో చిన్నారుల చేతిలో స్మార్ట్ ఫోన్లు పట్టుకుని వీడియో గేమ్స్ ఆడడం లేదా ఇంట్లో ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని వీడియో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. వ్యసనంగా మారుతున్న ఈ వీడియో గేమ్స్ పిల్లల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతున్నాయని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్లో ఆటలంటే ఇష్టపడే చిన్నారులను అదే ఆన్లైన్లో ఉన్న కథలపై దృష్టిమళ్లించడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. తద్వారా పిల్లలు కొత్త విషయాలు నేర్చుకుంటారు.
చందమామ.ఇన్
చందమామ పుస్తకం అంటే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడి చదువుతారు. చిన్నారులకు సంబంధించిన కథలు, జానపద సాహిత్యం, హాస్యం, తెలుగు భాషాభివృద్ధికి దోహదపడే పలు కథలను ఈ సైట్ లో పొందుపరిచారు. తెలుగుతో పాటు ఆంగ్లం, హిందీ, సంస్కృతం తదితర భాషల్లో పలు రకాల కథలు అందుబాటులో ఉన్నాయి. అక్బర్- బీర్బల్, చందమామ కథలతో పాటు పురాణాలు, ఇతిహాసాలు, లోకజ్ఞానం ముఖ్యంగా భేతాళ కథలు పిల్లలను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. చందమామ పుస్తకం ప్రతినెలా మార్కెట్లో విడుదలయ్యే పుస్తకం ఇందులో అందుబాటులో ఉంటుంది.
నీతికథలు.కామ్
ఒకప్పుడు పిల్లలకు ఇళ్లలో కానీ, స్కూళ్లలోని కానీ నీతి కథలను బోధించేవారు. తల్లిదండ్రులు వారివారి పనుల్లో బిజీగా ఉండడంతో నీతి కథలను పిల్లలకు బోధించేందుకు సమయం లేకుండాపోయింది. దీంతో పిల్లలు తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం వారి పట్ల మర్యాదతో మెలగడం కనిపించడం లేదు. ఆన్లైన్లోకి వెళ్లి
ఈ సైట్ ను ఓపెన్ చేసి ఎన్నో నీతికథలను చదివించవచ్చు. తద్వారా కుటుంబబంధాలు, పెద్దలపట్ల గౌరవం, సంస్కారం, పిల్లల్లో అలవడుతుంది.
బాలవినోదం.కామ్
ఈ వెబ్సైట్ను ఓపెన్ చేయగానే పిల్లలు అమితంగా ఇష్టపడే పంచతంత్ర కథలతో పాటు బాలసాహిత్యం కనిపిస్తాయి. అలాగే ఇందులో బొమ్మలతో కూడిన పాటలు కూడా ఇందులో ఉండటంతో చిన్నారులు చక్కగా వీటిని అర్థం చేసుకుంటారు.
మంచి పుస్తకం. ఇన్
మంచి పుస్తకం. ఇన్ వెబ్సైట్ను ఓపెన్ చేయగానే వివిధ రకాల బొమ్మలు చిన్నారుల్లో ఆసక్తి కలిగిస్తాయి. తెలుగుతో పాటు ఇంగ్లిష్ లో చిన్నారులకు అవసరమయ్యే రకరకాల పుస్తకాలు ఇందులో ఉన్నాయి. పరమానంద శిష్యుల కథలు, చిట్టి చిలుకమ్మ కథలు, పెదరాసి పెద్దమ్మ, చిట్టి చిన్నారి కథలు కనిపిస్తాయి. వీటిని చదవడం ద్వారా పిల్లల్లో పాఠనాసక్తి పెరగడంతో పాటు నీతిని పెంపొందించుకుంటారు.