సారథి న్యూస్, కర్నూలు: అవుట్ సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకే ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అమరావతి సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఏపీ ఆప్కాస్ ను ప్రారంభించి 50,449 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి మధ్యదళారులు, ఏజెన్సీల ప్రమేయం లేకుండా ఆప్కాస్‌ను ఏర్పాటు చేశామన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీలకు 50 శాతంతో పాటు మహిళలకు కూడా 50 శాతం కేటాయించామన్నారు. ఉద్యోగాల్లో ఈఎస్ఐ, ఈపీఎఫ్వంటి విధానాలు సక్రమంగా పాటించాలని ఆదేశాలు జారీచేశామన్నారు. ఈ వ్యవస్థను ఇక నుంచి జిల్లా కలెక్టర్లే స్వయంగా పర్యవేక్షించాలని సీఎం సూచించారు. కర్నూలు జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ జి.వీరపాండియన్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జేసీ 3 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.