Breaking News

పల్టీ కొట్టిన ఏపీ మంత్రి ఎస్కార్ట్ వెహికిల్​

పల్టీ కొట్టిన ఏపీ మంత్రి ఎస్కార్ట్ వెహికిల్​

  • హెడ్​కానిస్టేబుల్ ​మృతి
  • ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు
  • మెరుగైన చికిత్స కోసం కిమ్స్ కు తరలింపు

సారథి న్యూస్, ఎల్బీనగర్: హైదరాబాద్​నుంచి విజయవాడకు ఔటర్​ రింగ్ ​రోడ్డుపై వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్కార్ట్​ వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ హెడ్​కానిస్టేబుల్​మృతిచెందగా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు​ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం తుర్కయంజాల్​ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ మంత్రి కాన్వాయ్​హైదరాబాద్​నుంచి ఔటర్​రింగ్​రోడ్డు మీదుగా విజయవాడకు బయలుదేరారు. మార్గమధ్యంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​మండలం, తుర్కయంజాల్ ​మున్సిపాలిటీ కోహెడ్ ​గ్రామ సమీపంలో ఔటర్​పై పెద్దఅంబర్​పేట సర్కిల్​ కు సమీపంలోకి రాగానే మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో ఏపీ 18 పీ 1359 కారు వెనక ఎడమవైపు టైర్​పగిలిపోయింది. దీంతో వాహనం అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న హెడ్​కానిస్టేబుల్​బి.పాపరావు(56), కానిస్టేబుళ్లు ​ డి.రాజు, వి.సీతారాముడు, డ్రైవర్​జయక్రిష్ణ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హయత్​నగర్​లోని సన్​రైస్​ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి అప్పటికే పాపరావు మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. మిగతా ముగ్గురు కానిస్టేబుళ్లకు ప్రథమ చికిత్స అనంతరం ఎల్బీనగర్​లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారిని సికింద్రబాద్​లోని కిమ్స్​ఆస్పత్రికి తరలించి ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు. మృతుడు హెడ్​ కానిస్టేబుల్​పాపరావు మృతదేహానికి పంచనామా అనంతరం స్వగ్రామమైన శ్రీకాకుళం తరలించేందుకు పోలీసులు బంధువులకు అప్పగించారు.

క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి
ఘటన స్థలం నుంచి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగానే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నేరుగా హయత్​నగర్​లోని సన్​రైస్​ఆస్పత్రికి చేరుకుని కానిస్టేబుళ్ల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం ముగ్గురు కానిస్టేబుళ్లను వెంటనే ఎల్బీనగర్​లోని కామినేని ఆస్పత్రికి తరలించి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారు.