- ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదే లక్ష్యం
- రెవెన్యూశాఖలో ప్రమోషన్లు ప్రక్రియను పూర్తిచేయాలి
- ట్రెసా ప్రతినిధుల సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రజల కేంద్ర బిందువుగానే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ నేపథ్యంలోనే నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. ఈ చట్టం ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేద్దామని పిలుపునిచ్చారు. శనివారం ప్రగతిభవన్‌లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రెవెన్యూశాఖలో అన్ని స్థాయిలో ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సౌకర్యాల కల్పన కోసం రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీఆర్వోలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇతర శాఖల్లో చేరేందుకు ఆప్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీఆర్ఏల్లో పేదవర్గాల వారే ఉన్నారని, వీరిలో వయోభారంతో ఉన్నవారి పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. వీఆర్ఏలకు స్కేలు కల్పిస్తామన్నారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎంవో ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్(ట్రైసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.