యంగ్ హీరో నితిన్ పెళ్లి సాదాసీదాగా ఆదివారం బంధుమిత్రుల సమక్షంలో జరిగిపోయింది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు నితిన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో నితిన్ కు ‘రంగ్ దే’ టీమ్ క్యూట్ మ్యారేజ్ గిఫ్ట్ అంటూ ప్రత్యేకంగా కట్ చేసిన టీజర్ తో స్పెషల్ విషెస్ తెలియజేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నిజజీవితంలో ఎంతో హ్యాపీగా పెళ్లి చేసుకున్న నితిన్.. ఈ సినిమా లేటెస్ట్ టీజర్ లో మాత్రం పెళ్లంటే ఆమడ దూరం పారిపోయే బ్యాచిలర్ గా కనిపించాడు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ బలవంతంగా కీర్తిసురేష్ తో తనకు రిజిస్టర్ మ్యారేజ్ చేయించడం, పెళ్లయ్యాక ఎలాంటి తిప్పలు పడ్డాడనేది సరదాగా ఈ టీజర్ లో చూపించారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్టుగా టీజర్ చివరిలో తెలిపారు. మొత్తానికి ప్రస్తుత నితిన్ రియల్ లైఫ్ కి ముడిపడినట్టున్న అందమైన పెళ్లి కానుకను ఇచ్చారు ‘రంగ్ దే’ టీమ్.