సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ నిండుకుండలా మారింది.. భారీవర్షాలకు జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం నీటిమట్టం 30 ఫీట్లకు చేరింది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టును 1954 లో నిర్మించారు. అప్పటి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కేఎం ఖర్జూ ప్రాజెక్టును ప్రారంభించి మొట్టమొదటిసారిగా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టును అప్పట్లో కేవలం వర్షాధారం ప్రాతిపదికగానే 12వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా నిర్మించారు. ఆ తర్వాత ఎత్తిపోతల పథకంగా మార్చారు. ఇక్కడి నుంచి 50వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా రూపొందించారు.
కొద్దిరోజులుగా జూరాల బ్యాక్ వాటర్ నుంచి కృష్ణాజలాలను కోయిల్ సాగర్ కు తరలిస్తున్నారు. దీంతో పాటు కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి వర్షపు నీరు పెద్దఎత్తున ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో కోయిల్ సాగర్ కు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 32.5 ఫీట్లు. ఇంకా 2.5 ఫీట్ల నీరు వచ్చి చేరితే గేట్లు తెరిచే అవకాశం ఉంది.