సారథి న్యూస్, అనంతపురం: దివంగత మహానేత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన ‘‘నాలో.. నాతో… వైఎస్సార్’ పుస్తకాన్ని మహానేత 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన మాతృమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని మహానేత తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. డాక్టర్ వైఎస్సార్ సహధర్మచారిణిగా వైఎస్ విజయమ్మ 37ఏళ్ల జీవితసారమే ఈ పుస్తకం.
2009 సెప్టెంబర్ 2న అనూహ్యంగా వైఎస్సార్ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం. మహానేత గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజల నుంచి తెలుసుకున్నానని, ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చానని ఆమె తన తొలి పలుకులో చెప్పారు. నిజజీవితంలో వైఎస్సార్ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో ఉన్నది ఉన్నట్టుగా ఆమె వివరించారు. మరణం లేని మహానేత గురించి ముందు తరాలకు కూడా స్ఫూర్తి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ఈ పుస్తకాన్ని ప్రజల ముందు ఉంచుతున్నానని ఆమె ప్రకటించారు. ఆయన జీవితమే తెరిచిన పుస్తకమని, ఆయన ప్రజాప్రస్థానంలో ప్రతి అడుగూ ప్రజల జీవితంతోనే ముడిపడి ఉందని విజయమ్మ వివరించారు.