- మొదటి రోజు శైలపుత్రికగా జోగుళాంబ అమ్మవారు
- అక్టోబర్ 25వ తేదీ వరకు వేడుకలు
సారథి న్యూస్, అలంపూర్, మెదక్: తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో శనివారం దేవీశరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్19 నిబంధనల మేరకు ఆర్భాటాలకు దూరంగా సంప్రదాయాలు ఉట్టిపడేలా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. ప్రతిరోజు జోగుళాంబ అమ్మవారిని నవదుర్గాల్లో ఒకరిగా అలంకరించి ఆరాధించడం ఆనవాయితీ. మొదటి రోజు కావడంతో జోగుళాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. జడ్పీ చైర్మన్ పర్సన్ సరితా తిరుపతయ్య, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం హాజరై ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొవిడ్-19 కారణంగా భక్తులు పూజల్లో పాల్గొనే అవకాశం లేదని ఈవో ప్రేమ్‌కుమార్ తెలిపారు. భక్తులంతా తప్పనిసరిగా మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి దర్శించుకోవాలని సూచించారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా బీచుపల్లి సరస్వతి ఆలయాన్ని విద్యుత్‌దీపాలతో సుందరంగా అలంకరించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు ఆదిలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనుంది. మల్దకల్మండల కేంద్రంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలలో శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమమయ్యాయి. తొలిరోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.