Breaking News

నవంబర్​ వరకూ ఉచిత రేషన్​

న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్​ వరకు ప్రజలకు ఉచితంగా రేషన్​ అందజేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. వన్​ నేషన్​.. వన్​ రేషన్​ కింద దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న పేదలైనా ప్రభుత్వ సాయం పొందవచ్చని చెప్పారు. వలస కూలీలను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని ప్రవేశపెడుతుమన్నారు. రేషన్​ కార్డు ఉన్న నిరుపేదలందరికీ నెలకు 5 కిలోల బియ్యం, గోధుమలు, కిలో కందిపప్పు అందజేస్తామని చెప్పారు. 80 కోట్లమంది ఈ పథకం కింద లబ్ధి పొందుతారని ప్రధాని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. అన్‌లాక్‌-2లోకి ప్రవేశిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు మనమంతా వ్యాధులు వచ్చే సీజన్​లోకి వస్తున్నామని చెప్పారు. ఈ సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా మరణాల రేటులో భారత్​.. ప్రపంచదేశాల కన్నా మెరుగ్గా ఉందన్నారు. మన వైద్యసిబ్బంది కృషితో లక్షలమంది ప్రాణాలు కాపాడగలిగామన్నారు.

అన్‌లాక్‌-1 తర్వాత ప్రజల్లో నిర్లక్ష్య ధోరణి కనిపించిందని.. ఇది సరి కాదని హితవు పలికారు. గ్రామ సర్పంచ్ అయినా దేశ ప్రధాని ఒకే రకంగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. మహా ముప్పు పొంచి ఉందని చెప్పారు. లాక్‌డౌన్‌ కాలంలో ఎంతో నియమనిష్టలు పాటించామని.. అలాంటి కట్టుబాట్లను తిరిగి ఇప్పుడు దేశమంతా పాటించాలన్నారు. కట్టడి ప్రాంతాల్లో నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఓ దేశ ప్రధానిపై రూ.13,000 జరిమానా వేశారని చెప్పారు. కాగా ఇవాళ ఉదయం ప్రధాని మోదీ .. కోవిడ్‌19 వ్యాక్సిన్‌పై ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. లాక్​డౌన్​ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం ఇది ఆరోసారి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మే 12న ఆయన చివరిసారి 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.