Breaking News

ధోనీ వస్తున్నాడా?

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడా? టీమిండియాలో అతను మళ్లీ కనిపించనున్నాడా? ఈ అంశంపై కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జులై చివరిలో టీమిండియా కోసం బీసీసీఐ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. అందులో ధోనీని ఎంపిక చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోనున్నారు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత మహీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. దీంతో అతని పేరును సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తప్పించారు. అయినా కూడా బీసీసీఐ మదిలో మాత్రం మహీని టీమ్​లో కొనసాగించాలనే ఆలోచనలే కనిపిస్తున్నాయి. ఒకవేళ టీ20 ప్రపంచకప్ జరిగితే ధోనీ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్​ఎస్కే ప్రసాద్ అన్నాడు. అప్పుడు మహీ కచ్చితంగా సన్నాహాక శిబిరంలో ఉంటాడన్నాడు. ‘టీ20 ప్రపంచకప్ జరిగితే సన్నాహక శిబిరంలో ధోనీ తప్పక ఉంటాడు. ద్వైపాక్షిక సిరీస్ లు జరిగితే అతనికి ప్రత్యామ్నాయంగా రాహుల్, రిషబ్ పంత్​ ఉండనే ఉన్నారు. ఆరు వారాల శిక్షణలో ధోనీ ఉండటం వల్ల యువ వికెట్ కీపర్లకు చాలా లాభం ఉంటుంది’ అని ప్రసాద్ పేర్కొన్నాడు. ఏడాదిగా క్రికెట్ ఆడకపోయినా, సెంట్రల్ కాంట్రాక్ట్​లో లేకపోయినా, ఐపీఎల్లో చెలరేగితే ధోనీ.. టీమిండియాలోకి వచ్చేస్తాడని మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా వెల్లడించాడు.