Breaking News

దూసుకొస్తున్న వాయుగుండం.. రెండ్రోజులు వర్షాలు

సారథిన్యూస్​, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కోస్తాఆంధ్ర వైపు దూసుకొస్తున్నది. అయితే మరో 12 గంటల్లో అతి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్​లోని నర్సాపురం, విశాఖ, కాకినాడ సమీపంలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది.

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 20సెం.మీ. కంటే అత్యధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది.