Breaking News

తేనె కోసం వెళ్లి.. లోయలో పడి ఇద్దరి మృతి

తేనె కోసం వెళ్లి.. లోయలో పడి మృతి

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: తేనె సేకరణకు వెళ్లిన ఇద్దరు చెంచు యువకులు చెట్టుకు కట్టిన తాగు తెగిపోయి లోయలోపడి చనిపోయారు. ఈ దుర్ఘటన శనివారం నాగర్​కర్నూల్​జిల్లా అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి సమీప అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆదివాసీ చెంచులు దాసరి బయన్న(35), దాసరి పెద్దలు(28), దాసరి వెంకటయ్య కలిసి నల్లమల అటవీ ప్రాంతంలోకి తేనె సేకరణకు వెళ్లారు. చెట్టుకు కట్టిన తాడు ప్రమాదవశాత్తు తెగిపోవడంతో ముగ్గురూ లోయలో పడిపోయారు. వారిలో దాసరి బయన్న, దాసరి పెద్దులు చనిపోగా, వెంకటయ్య తీవ్రంగా గాయపడ్డారు. నల్లమలలోని అంతరగంగ శివాలయానికి కిలోమీటర్ దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని గ్రామస్తులు తెలిపారు.
ఘటన స్థలానికి కలెక్టర్​ శర్మన్​
ఆదివాసీ చెంచు యువకులు చనిపోయిన విషయం తెలుసుకున్న నాగర్​కర్నూల్​జిల్లా కలెక్టర్​ఎల్.శర్మన్​హుటాహుటిన అడవిలోని సంఘటన స్థలానికి వెళ్లారు. లోయలో నుంచి డెడ్​బాడీస్​ను వెలికితీసే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. అలాగే గాయపడిన వారికి పరామర్శించేందుకు అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. మృతి చెందిన చెంచు కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని కలెక్టర్ శర్మన్ భరోసా ఇచ్చారు. కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డీవో పాండు నాయక్ తదితరులు ఉన్నారు