సారథి న్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషా నేర్చుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇప్పటికే కొన్ని వందల తెలుగు మీడియం స్కూళ్లు మూతపడ్డాయి. అదే సమయంలో ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల సంఖ్య విపరీతంగా పెరిగాయి. ఏపీలో అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం తీసుకొస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై విపక్షాలతో పాటు తెలుగు భాషాభిమానులు కూడా భగ్గుమన్నారు. దీనిపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఇప్పుడు ప్రపంచమంతా ఇంగ్లిష్ వైపే మొగ్గుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు నేర్చుకుంటే ప్రయోజనం లేదన్న వాదన కూడా వినిపించింది. దీంతో కూలినాలి చేసుకునే వారు కూడా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలోనే చేర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు జరుగుతుంటే.. మన దేశం కాని దేశం.. తెలుగుతో అసలు అవసరం కూడా లేని దేశం తెలుగుపై మక్కువను పెంచుకుంటోంది.. ఆ దేశమే ఆస్ట్రేలియా.
తెలుగుకు సముచితస్థానం
తెలుగు నేలపై తెలుగంటే చులకనగా చూస్తుండగా ఆస్ట్రేలియా మాత్రం తెలుగు భాషకు సముచిత గౌరవం ఇస్తోంది. అక్కడ విద్యార్థులు 12వ తరగతి వరకు తెలుగును ఐచ్చిక అంశంగా ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది అక్కడ ప్రభుత్వం. అంతే కాదండోయ్ ఇలా తెలుగు అంశాన్ని ఎన్నుకున్నందుకు వారికి ఐదు మార్కులు అదనంగా కూడా కలుపుతున్నారు. అంతేకాకుండా జాతీయ ట్రాన్స్‌లేటర్స్ అండ్ ఇంటర్ ప్రెటర్స్ పరీక్ష రాసేవారు కూడా తెలుగును ఎంచుకుంటే వారికి కూడా ఐదు మార్కులు కలుపుతున్నారు. ఇప్పటి వరకు తమిళ, హిందీ, పంజాబీ భాషలకు ఆస్ట్రేలియా ప్రభుత్వ గుర్తింపు లభించింది. ఇప్పుడు అక్కడ తెలుగు భాషకు కూడా గుర్తింపు లభించినట్టయింది. తెలుగు రాష్ట్రాల్లోని భాషాభిమానులకు ఇది కొంత సంతోషం కలిగించే అంశమైనా, తెలుగు భాష ప్రాధాన్యం తగ్గిపోవడం వారిలో ఆందోళన కలిగిస్తోంది.
- July 25, 2020
- Archive
- Top News
- AUSTRALIA
- ENGLISH
- TELUGU
- ఆస్ట్రేలియా
- ఇంగ్లిష్‌మీడియం
- తెలుగు భాష
- Comments Off on తెలుగు కోసం ఆస్ట్రేలియా ఏం చేసిందంటే..