Breaking News

తెలంగాణ వచ్చినా.. ఎలాంటి న్యాయం జరగలేదని

తెలంగాణ వచ్చినా.. ఎలాంటి న్యాయం జరగలేదని
  • ఒంటిపై పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకుని..
  • కలకలం రేపిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం
  • అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఘటన

సారథి న్యూస్, హైదరాబాద్: అసెంబ్లీకి కూతవేటు దూరం.. గురువారం మధ్యాహ్నం.. రవీంద్రభారతికి సమీపంలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తనకు ఎలాంటి న్యాయం జరగలేదని కేకలు వేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు అంటుకుంటున్న క్రమంలోనే ‘జై తెలంగాణ.. జై కేసీఆర్​’ అంటూ నినాదాలు చేశాడు. తనది కడ్తాల్​ అని, తన పేరు నాగులు​ అని చెప్పుకొచ్చాడు. మంటలు ఆర్పివేసిన పోలీసులు హుటాహుటిన ఆటోలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఆర్థికంగా కుంగదీసిన కరోనా

నార్లకంటి నాగులు

రంగారెడ్డి జిల్లా కడ్తాల మండల కేంద్రానికి చెందిన నార్లకంటి రాములు కొడుకు నాగులు 20 ఏళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ కు వెళ్లాడు. ఊరులో సొంతిల్లు కూడా లేదు. సొంతంగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ప్రస్తుతం భార్యాపిల్లలతో కలిసి ఖైరతాబాద్ లో నివాసం ఉంటున్నాడు. పంజాగుట్టలోని ఓ షాపింగ్ మాల్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. భార్య ఓ ప్రైవేట్​ కంపెనీలో పనిచేస్తోంది. పిల్లలు డిగ్రీ వరకు చదివారు. లాక్ డౌన్ నేపథ్యంలో నాగులుకు పనిలేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం వచ్చినా, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమంలో పాల్గొన్న తన జీవనస్థితి మారలేదని కలతచెందాడు. ఈ నేపథ్యంలో ఒంటిపై పెట్రోల్ ​పోసుకుని నిప్పంటించుకున్నాడని కుటుంబసభ్యులు, స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.